చైనాలో తొలి తమిళ సినిమా అదే..

చైనాలో తొలి తమిళ సినిమా అదే..

గత ఏడాది దీపావళి కానుకగా విడుదలైన తమిళ సినిమా ‘మెర్శల్’ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. జీఎస్టీకి వ్యతిరేకంగా ఇందులో ఉన్న డైలాగుల విషయమై చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ కూడా ఆశ్చర్యపరిచాయి. దేశవ్యాప్తంగా విడుదలయ్యే బాలీవుడ్ స్టార్ హీరోల హిందీ సినిమాలకు దీటుగా ఈ చిత్రం ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఫుల్ రన్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘మెర్శల్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అదిరింది’ పేరుతో రిలీజ్ చేస్తే ఇక్కడా మంచి ఫలితమే దక్కింది. ఇప్పుడీ చిత్రం అరుదైన గౌరవం దక్కించుకుంది. చైనాలో విడుదల కాబోతున్న తొలి తమిళ సినిమాగా ‘మెర్శల్’ రికార్డు సృష్టించబోతోంది.

ఆరేడేళ్ల కిందటి వరకు చైనాలో భారతీయ సినిమా రిలీజ్ కావడం అన్ని అసాధ్యమైన విషయం. కానీ అమీర్ ఖాన్ సినిమాలు ‘త్రీ ఇడియట్స్’.. ‘పీకే’.. ‘దంగల్’ ఒక్కొక్కటిగా అక్కడ రిలీజై భారతీయ సినిమా సత్తాను చాటి చెప్పాయి. ‘దంగల్’ అయితే ఏకంగా రూ.1300 కోట్ల దాకా అక్కడ వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. దీంతో ఇండియన్ సినిమాలకు చైనాలో గేట్లు తెరుచుకున్నాయి. హిందీలో మంచి విజయం సాధించిన సినిమాలన్నీ అక్కడికి వెళ్తున్నాయి. కానీ దక్షిణాది సినిమాలకు మాత్రం ఇంకా అక్కడ దారులు తెరుచుకోలేదు. చైనా మార్కెట్ గురించి మనవాళ్లు ఇంకా ఆలోచించలేదు.

ఈలోపు ‘మెర్శల్’ టీం తమ సినిమాను చైనాలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసింది. చైనాలో మంచి ఫలితాన్నందుకున్న సల్మాన్ సినిమా ‘భజరంగి భాయిజాన్’ను రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ సంస్థే ‘మెర్శల్’ను అక్కడికి తీసుకెళ్తుండటం విశేషం. ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లు రాబడితే మున్ముందు దక్షిణాది నుంచి మరిన్ని సినిమాలు చైనాకు వెళ్లే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English