దిల్ రాజు అతే కొంపుమంచిందా?

దిల్ రాజు అతే కొంపుమంచిందా?

కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లుగా ఎవరి సినిమా వాళ్లకు గొప్పగానే ఉంటుంది. రిలీజయ్యే పది సినిమాల్లో ఆడేది ఒక్కటే అయినా.. ప్రతి ఒక్కరూ తమ సినిమా సూపర్ హిట్టన్నట్లే మాట్లాడతారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తమ సినిమాల గురించి మరీ అతిగా డబ్బా కొట్టేసుకుంటారు. శ్రుతి మంచిన ప్రకటనలు చేస్తుంటారు. సినిమాకు హైప్ పెంచడం కోసం కాన్ఫిడెన్స్ చూపించడం ఓకే కానీ.. ఆ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైతేనే కష్టం.

తమ సినిమా గురించి మరీ ఎక్కువ చెప్పుకోవడం ద్వారా ప్రేక్షకుల్లో అంచనాల్ని మరీ పెంచేసి దెబ్బ తిన్న నిర్మాతలూ ఉన్నారు. దిల్ రాజు ఇప్పుడు ఆ కోవలోకే చేరేట్లున్నాడు. మామూలుగా దిల్ రాజు మాటకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆయన ఒక సినిమా గురించి చాలా కాన్ఫిడెంటుగా కనిపించాడంటే అది కచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం జనాల్లో ఉంది.

కానీ ఈ మధ్య దిల్ రాజు జడ్జిమెంట్ తేడా కొట్టేస్తోంది. కథల ఎంపికలో.. సినిమా ఫలితం గురించి అంచనా వేయడంలో ఆయన గాడి తప్పుతున్నారు. గత రెండేళ్లలో అందుకు చాలానే రుజువులు కనిపిస్తాయి. అయినప్పటికీ జనాలు ఆయనపై నమ్మకం కోల్పోలేదు. తన నిర్మాణంలో వచ్చిన కొత్త సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’ గురించి రాజు ఓ రేంజిలో చెబుతుంటే ఇదో గొప్ప సినిమా అనుకున్నారు. నిజానికి రాజు ఏమీ మాట్లాడకముందే ఈ చిత్ర ప్రోమోలే దీనికి హైప్ తెచ్చాయి. ఒక పాజిటివ్ బజ్ ఏర్పడింది. అలాంటి స్థితిలో రాజు దీన్ని ‘బొమ్మరిల్లు’తో పోల్చడం.. తమ సంస్థలో ఒక మైలురాయి అనడం.. డిస్ట్రిబ్యూటర్లకు ముందే షో వేసి చూపించి వాళ్లతో మాట్లాడించడం.. ఇలాంటివన్నీ చేసి సినిమాపై అంచనాలు మరీ పెరిగిపోయేలా చేశాడు.

ఆ అంచనాలతో థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులకు ‘శ్రీనివాస కళ్యాణం’ పెద్ద షాకే ఇచ్చింది. మామూలుగా చూస్తే ఈ సినిమా ఓకే అనిపించునేమో. కానీ రాజు అండ్ కో చెప్పిన మాటలతో మరీ ఎక్కువ అంచనాలతో చూడటంతో తీవ్ర నిరాశకు గురి చేసింది. ఒక సినిమాపై మరీ ఎక్కువ మాట్లాడి అంచనాలు పెంచడం వల్ల ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు