వీడ్కోలు సినిమా కలిసి రాదా?

వీడ్కోలు సినిమా కలిసి రాదా?

సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోలు.. తమకున్న ఫాలోయింగ్‌ను రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం.. ప్రజా జీవితంలోకి రావడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. దక్షిణాదిన ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులు రాజకీయారంగేట్రం చేసి ఆ రంగంలోనూ తమదైన ముద్ర వేశారు. ఈ తరంలోనూ పెద్ద నటులు రాజకీయాల వైపు చూస్తున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే ముందు వాళ్లు సినిమాలకు టాటా చెప్పేస్తున్నారు. ఐతే చివరగా అభిమానులకు ఒక మంచి జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్లాలని ఆశిస్తున్న వాళ్ల కోరిక మాత్రం నెరవేరడం లేదు. ఇటు తెలుగులో.. అటు తమిళంలో పెద్ద రాజకీయాల వైపు అడుగులేస్తున్న పెద్ద హీరోలు ఒక్కొక్కరికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల ముంగిట రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందే ఆయన సినిమాలకు టాటా చెప్పేశారు. ఆ సమయానికి ఆయనకు మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశం లేదు. ఐతే రాజకీయాల్లోకి వచ్చే ముందు చివరగా చేసిన ‘శంకర్ దాదా జిందాబాద్’ ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అభిమానులకు చివరగా మంచి జ్ఞాపకాన్ని మిగల్చాలన్న కోరిక నెరవేరలేదు. ఐతే చిరు ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో రాజకీయాలకు టాటా చెప్పేసి తిరిగి సినిమాల్లోకి రావడం వేరే విషయం.

ఇక అన్నయ్య బాటలోనే ఇప్పుడు రాజకీయారంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఇకపై సినిమాలు చేసే ఉద్దేశం లేదంటున్నాడు. అతడి నుంచి వచ్చిన చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’ ఏమైందో తెలిసిందే. పవన్ కెరీర్లోనే కాదు.. టాలీవుడ్ చరిత్రలోనే ఇది అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమా అయింది. పవన్ నుంచి చివరగా ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇక తమిళ సినీ పరిశ్రమ సంగతి చూస్తే.. రాజకీయారంగేట్రం చేసే ముందు తన ఐడియాలజీ ఏంటో చూపిస్తూ ‘కాలా’ సినిమా చేశాడు రజనీ. అది డిజాస్టర్ అయింది. ఐతే ఇది ఆయనకు చివరి సినిమా కాదు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నదే చివరిది అయ్యే అవకాశముంది. ఆ సినిమా ఫలితం ఏమవుతుందో చూడాలి. కమల్‌కు ‘విశ్వరూపం-2’నే చివరి చిత్రం అంటున్నారు. అదైతే ఆయనకు, అభిమానులకు చేదు అనుభవాన్నే మిగిల్చేలా కనిపిస్తోంది. కమల్ ‘భారతీయుడు-2’ కూడా చేయాల్సి ఉన్నా.. అది సందిగ్ధంలో పడింది. ఆ సినిమా కమల్ చేయకపోతే మాత్రం రాజకీయారంగేట్రానికి ముందు చివరగా పెద్ద ఫ్లాప్ ఇచ్చిన నటుల్లో ఆయన పేరును కూడా చేర్చొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English