‘గూఢచారి’ది ఏం అదృష్టమో..

 ‘గూఢచారి’ది ఏం అదృష్టమో..

కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా ఆదరణకు నోచుకోవు. అందుకు రిలీజ్ టైమింగ్ కూడా కారణమవుతూ ఉంటుంది. సరైన రిలీజ్ డేట్లో సినిమాను రిలీజ్ చేయాలి. వేరే అంశాలు కూడా కలిసి రావాలి. అలా కలిసొచ్చే కాలంలో అనుకున్నదానికంటే కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటుంటాయి. ‘గూఢచారి’ విషయంలో ఇదే జరుగుతోంది.

ఈ చిత్రం విడుదలకు ముందు రెండు వారాల్లో వచ్చిన సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఆవురావురుమని ఎదురు చూస్తున్న సమయంలో ఇది రిలీజైంది. దీనికి పోటీగా విడుదలైన సినిమాల్లో ‘చి ల సౌ’కు మంచి టాక్ వచ్చినా.. అది థియేటర్లకు ఆశించిన స్థాయిలో జనాల్ని తీసుకురాలేకపోయింది. ‘బ్రాండ్ బాబు’ గురించైతే చెప్పాల్సిన పని లేదు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు.

‘గూఢచారి’ సినిమా విషయంలో ఇండస్ట్రీ జనాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ ఈ సినిమాను తెగ పొగిడేశారు. సోషల్ మీడియాలో మంచి ప్రచారం చేసిపెట్టారు. ‘చి ల సౌ’కు నిర్మాత అయి ఉండి కూడా అక్కినేని నాగార్జున ‘గూఢచారి’ సక్సెస్ మీట్‌కు వచ్చి ఆ సినిమాను ఆకాశానికెత్తేశారు. చిత్ర బృందం కూడా పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ బాగా చేసి సినిమా వీక్ డేస్‌లో కూడా బాగా ఆడేలా చూసుకుంది. ఈ సానుకూలతలకు తోడు.. ఈ వారం రిలీజైన రెండు సినిమాల టాక్ ఏమంత గొప్పగా లేకపోవడం కూడా దీనికి కలిసొస్తోంది. ‘శ్రీనివాస కళ్యాణం’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. కుటుంబ ప్రేక్షకులకు మాత్రమే ఇది నచ్చేలా ఉంది. యూత్‌కు ఈ వారం కూడా ‘గూఢచారి’నే ఛాయిస్ అయ్యేలా ఉంది.

కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం-2’ ఏమైనా ప్రభావం చూపుతుందేమో అనుకుంటే.. దానికి ఆశ్చర్యకరంగా బ్యాడ్ టాక్ వచ్చింది. తొలి భాగానికి దీనికి పోలికే లేదనేస్తున్నారు. అసలే చాలా ఆలస్యంగా కావడం వల్ల దీనికి బజ్ లేదు. ఇండియాలో వచ్చిన స్పై థ్రిల్లర్లలో ఒకటిగా ‘విశ్వరూపం’ పేరు తెచ్చుకుంటే.. ఇప్పుడు టాలీవుడ్ బెస్ట్ స్పై థ్రిల్లర్ అనిపించుకుంటుున్న ‘గూఢచారి’ ముందు ‘విశ్వరూపం-2’ నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ‘గీత గోవిందం’ వచ్చే వరకు ‘గూఢచారి’కి ఎదురు లేదన్నట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English