బాలయ్య సినిమాపై ఆశ చావలేదే..

బాలయ్య సినిమాపై ఆశ చావలేదే..

‘ఇంటిలెజెంట్’ సినిమా చూశాక వి.వి.వినాయక్‌తో ఏ స్టార్ హీరో అయినా పని చేస్తాడా అని అందరూ సందేహించారు. కానీ సినిమాల ఎంపికలో సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరైన నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ దర్శకుడితో పని చేయడానికి ముందుకొచ్చాడు. కానీ ఏం లాభం..? ఈ అవకాశాన్ని వినాయక్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బాలయ్యను మెప్పించే కథను రెడీ చేయించలేకపోయాడు.

‘జై సింహా’ రిలీజ్ తర్వాత ఆరు నెలలకు పైగా బాలయ్య ఖాళీగా ఉన్నాడు. కానీ ఈలోపు బాలయ్యకు నచ్చే కథ రెడీ కాలేదు. వేర్వేరు రచయితలతో రకరకాల కథలు తయారు చేయించి బాలయ్యకు వినిపించినా.. ఆయనకు నచ్చలేదని వార్తలొచ్చాయి. ఈలోపు ఎన్టీఆర్ బయోపిక్‌కు రంగం సిద్ధం కావడంతో దాని మీదికి వెళ్లిపోయాడు నందమూరి హీరో.

ఇక వినాయక్ సినిమా లేనట్లే అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ వినాయక్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడాడు. తన తర్వాతి సినిమా బాలయ్యతోనే ఉంటుందని ధ్రువీకరించాడు. ఆ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని కూడా చెప్పాడు. కానీ ఎవరు కథ రెడీ చేస్తున్నారు.. లైన్ ఓకే అయిందా లేదా.. ఎప్పుడు సినిమా మొదలవుతుందన్నది మాత్రం వినాయక్ చెప్పలేదు. కానీ వినాయక్‌తో బాలయ్య సినిమా నిజంగా ఉంటుందా.. ఉన్నా కూడా వచ్చే ఏడాది కాలంలో మొదలవుతుందా అన్నది మాత్రం డౌటే.

ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలయ్య పూర్తి చేసే సమయానికి.. రామ్ చరణ్ సినిమా పని కానిచ్చి బోయపాటి శ్రీను రెడీగా ఉంటాడు. వీళ్లిద్దరి కలయికలో భారీ సినిమాకు ఇంతకముందే ఒప్పందం కుదిరింది. బోయపాటిని కాదని.. వినాయక్‌తో బాలయ్య సినిమా చేస్తాడా అంటే సందేహమే. ఒకవేళ ఈ సినిమా అయ్యాక వినాయక్‌తో సినిమా చేస్తే చేయొచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English