‘అరవింద’ కష్టాలు ఇన్నిన్ని కావు..

‘అరవింద’ కష్టాలు ఇన్నిన్ని కావు..

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’. ఈ సినిమాపై మామూలు అంచనాలు లేవు. దీనికి సంబంధించిన విశేషాల పట్ల అభిమానుల్లో చాలా క్యూరియాసిటీ ఉంది. ఐతే వాళ్లను నిరాశ పరచకుండా చాలా ముందుగానే ఈ చిత్ర టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చిన్న టీజర్ లాంటిది కూడా విడుదల చేశారు. కొన్ని ఆన్ లొకేషన్ పిక్స్ కూడా తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

కానీ ఇవి సరిపోవన్నట్లు చిత్ర బృందంలోని వాళ్లే అత్యుత్సాహంతో సినిమాలోని దృశ్యాలకు సంబంధించిన పిక్స్ లీక్ చేస్తుండటం పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్-నాగబాబు కాంబినేషన్లో తీసిన ఓ కీలక సన్నివేశానికి సంబంధించిన బయటికి వచ్చిన ఒక పిక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో చిత్ర బృందం చాలా సీరియస్ అయి.. షూటింగ్ ప్రదేశానికి ఎవ్వరూ ఫోన్ తేకుండా చూశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అయినా కూడా లీక్స్ ఆగలేదు. తాజాగా ఈ చిత్రం నుంచి మూడు ఫొటోలు లీక్ అయ్యాయి. అవి పోస్ట్ ప్రొడక్షన్ సందర్భంగా సిస్టంలో క్యాప్చర్ చేసిన ఫొటోలు. వాటి మీద వాటర్ మార్క్ చూస్తే అవి పోస్ట్ ప్రొడక్షన్ దశలోనివన్న విషయం స్పష్టమవుతోంది. ఒక ఫొటోలో నాగబాబు కూడా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ కారు నడుపుతున్నాడిందులో. ఈ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఈ విషయంలో త్రివిక్రమ్ అండ్ కో తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. వ్యవహారం పోలీసుల దాకా కూడా వెళ్లినట్లు తెలిసింది.

నిర్మాత కేసు పెట్టి బాధ్యుడైన వ్యక్తిని అరెస్టు చేయించినట్లు సమాచారం. ఐతే పెద్ద సినిమాల్లో వేటికీ లేని ఇబ్బంది ‘అరవింద సమేత’కే వస్తుండటం.. పదే పదే ఈ సమస్య పునరావృతం అవుతుండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది చిత్ర బృందం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English