బన్నీ హ్యాండిచ్చేసినట్లేనా?

బన్నీ హ్యాండిచ్చేసినట్లేనా?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో సినిమాకు సినిమాకు మధ్య బాగా విరామం తీసుకున్న నటుల్లో అల్లు అర్జున్ పేరు ముందు చెప్పుకోవాలి. అతను ఒక సినిమా అయిన వెంటనే ఇంకో సినిమా మొదలుపెట్టడు. కొంచెం గ్యాప్ తీసుకుని.. స్వయంగా స్క్రిప్టు వ్యవహారాల్ని పర్యవేక్షించి.. అంతా ఓకే అనుకున్నాకే రంగంలోకి దిగుతుంటాడు. ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా కూడా ఈ మధ్య అతడికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత ఏడాది వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ నిరాశ పరచగా.. ఈ ఏడాది వచ్చిన ‘నా పేరు సూర్య’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఈ చిత్రం విడుదల కావడానికి ముందు వరకు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు దాదాపు రెడీగా ఉన్న బన్నీ.. తర్వాత ఆలోచన మార్చుకున్నాడు. స్క్రిప్టు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యాక కూడా వెనకడుగు వేశాడు.

స్క్రిప్టులో మార్పుల కోసం అతను పట్టుబట్టినట్లు వార్తలొచ్చాయి. ఇక ప్రకటనే ఆలస్యం అనుకుంటున్న దశలో ఈ చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టాడు. తాజా పరిణామాల్ని బట్టి చూస్తుంటే.. విక్రమ్‌తో బన్నీ సినిమా పూర్తిగా ఆగిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన విక్రమ్ నుంచి బన్నీ మార్కు వినోదాత్మక చిత్రం రావడం కష్టమే అని గీతా ఆర్ట్స్ జనాలు అంటున్నట్లు సమాచారం. ‘నా పేరు సూర్య’తో డిఫరెంటుగా ట్రై చేసి దెబ్బ తిన్న బన్నీ.. మళ్లీ ఎంటర్టైనర్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ మరో యోచన చేస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. త్వరలోనే ‘అరవింద సమేత’ పూర్తి చేసి ఖాళీ అవ్వనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసే ఆలోచన తెరమీదికి వచ్చినట్లు చెబుతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ‘జులాయి’ సూపర్ హిట్టయింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ పర్వాలేదనిపించింది. త్రివిక్రమ్ కు వెంటనే మరో స్టార్ హీరో దొరికే పరిస్థితి లేని నేపథ్యంలో స్క్రిప్టేదైనా రెడీగా ఉంటే బన్నీతో ముందుకెళ్లిపోవచ్చు. ఆ పరిస్థితుల్లో బన్నీ విక్రమ్‌కు హ్యాండిచ్చినా  ఇచ్చేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English