మరీ రాజశేఖర్ రేంజికి పడిపోయిందా?

మరీ రాజశేఖర్ రేంజికి పడిపోయిందా?

దశాబ్దానికి పైగా టాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగుతూ వచ్చింది కాజల్ అగర్వాల్. మామూలుగా ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉంటే గ్లామర్ విషయంలో తేడా వచ్చేస్తుంది. 30 ప్లస్‌లో ఎవరైనా అదుపు తప్పుతారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటికీ తన గ్లామర్‌ను కాపాడుకుంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఆమెకు అభిమాన గణం భారీగానే ఉంది. కానీ స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నప్పటికీ కాజల్.. కొంచెం రేంజ్ తగ్గించుకుని తక్కువ స్థాయి హీరోల పక్కన చేస్తుండటం ఆమె స్టేటస్ పడిపోతూ వస్తోంది. దగ్గుబాటి రానా.. నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి హీరోలతో నటించడం.. బెల్లంకొండ శ్రీనివాస్‌తోనూ సినిమా ఒప్పుకోవడంతో ఆమెనిప్పుడు ద్వితీయ శ్రేణి కథానాయికగా చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీనియర్ హీరో రాజశేఖర్ సైతం కాజల్ అగర్వాల్‌తో జత కట్టాలని చూస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘గరుడ వేగ’తో మళ్లీ ఫామ్ అందుకున్న రాజశేఖర్.. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ చిత్రంలో రాజశేఖర్‌కు జోడీగా పరిశీలిస్తున్న కథానాయికల్లో కాజల్ కూడా ఉందట. శ్రియ పేరును కూడా కన్సిడర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ రేంజ్ ఎంత తగ్గినప్పటికీ.. మరీ ఇప్పుడు పెద్దగా లైమ్ లైట్లో లేని.. మార్కెట్ కూడా బాగా తక్కువగా ఉన్న రాజశేఖర్  స్థాయికి పడిపోయిందా అన్న కామెంట్లు ఆమె అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. ఆమె ఈ సినిమా ఒప్పుకుంటే మాత్రం ఫ్యాన్స్ నిరాశ చెందడం ఖాయం. కానీ కాజల్ సినిమాల ఎంపిక చూస్తుంటే మాత్రం ఈ చిత్రానికి కూడా పచ్చ జెండా ఊపేసినా ఆశ్చర్యం లేదు. కెరీర్ చరమాంకంలో తన దగ్గరికి వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆమె ఒప్పేసుకుంటున్నట్లే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English