నాగ్ మాటలతో.. మహేష్ ఫ్యాన్స్ గుస్సా

నాగ్ మాటలతో.. మహేష్ ఫ్యాన్స్ గుస్సా

కొన్నిసార్లు యధాలాపంగా చేసే వ్యాఖ్యలే వివాదాస్పదం అవుతుంటాయి. మొహమాటాలేమీ లేకుండా తనకేమనిపిస్తే అది మాట్లాడేసే అక్కినేని నాగార్జున అప్పుడప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలతోనే ఇబ్బందుల్లో పడుతుంటారు. గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా రిలీజైనపుడు నాగ్ చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని బాధ పెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. రెండేళ్ల కిందట సంక్రాంతికి ‘సోగ్గాడే..’కు పోటీగా ‘నాన్నకు ప్రేమతో’ కూడా రిలీజైంది. ఈ రెండు సినిమాలూ 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేశాయి. కానీ నాగ్ సినిమా బడ్జెట్ తక్కువ. ఎన్టీఆర్ మూవీకి భారీగా ఖర్చయింది. ఈ నేపథ్యంలో నాగ్ మాట్లాడుతూ ఎంత ఖర్చు పెడితే ఎంత వచ్చిందన్నది ముఖ్యం అంటూ ఇన్‌డైరెక్టుగా ఎన్టీఆర్ సినిమాకు పంచ్ పడేలా వ్యాఖ్య చేయడం వివాదాస్పదమైంది.

కట్ చేస్తే ఇప్పుడు నాగ్ చేసిన ఒక కామెంట్ మహేష్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ‘గూఢచారి’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ఈ ఏడాది నిఖార్సయిన హిట్లు మూడే అని.. అవి ‘రంగస్థలం’.. ‘మహానటి’.. ‘గూఢచారి’ మాత్రమే అని నాగ్ అన్నాడు. కానీ నిజానికి వీటితో పాటు వేరే సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. అందులో ‘భాగమతి’.. ‘ఛలో’.. ‘తొలి ప్రేమ’.. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి సినిమాలున్నాయి. ఇవన్నీ కూడా నిర్మాతలకు మంచి లాభాలందించినవే. ఇక వేసవిలో విడుదలైన ‘భరత్ అనే నేను’ కూడా మంచి ఫలితాన్నందుకున్నదే. ఆ సినిమా రూ.100 కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. భారీ రేట్లకు సినిమాను అమ్మడం వల్ల బయ్యర్లు పెద్దగా లాభపడలేదు కానీ.. అది హిట్ మూవీ అనే చెప్పాలి. ఐతే మిగతా సినిమాలన్నీ చిన్న రేంజివి. స్టార్ హీరోలు నటించినవి కావు కాబట్టి నాగ్ కామెంట్‌ను వాటికి సంబంధించిన వాళ్లు తేలిగ్గా తీసుకుంటారేమో. కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం అలా తీసుకోవట్లేదు. ఈ సినిమాను మహేష్‌ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో.. రిలీజ్ తర్వాత ఎంత సంతోషించాడో తెలుసు కాబట్టి నాగ్ కామెంట్ మీద మండిపడుతున్నారు. వంద కోట్లు వసూలు చేసిన సినిమాను హిట్‌గా పరిగణించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English