షారుఖ్ కమల్ నుంచి పైసా తీసుకోలేదట..

షారుఖ్ కమల్ నుంచి పైసా తీసుకోలేదట..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ డబ్బు మనిషి అనే విమర్శ ఎప్పట్నుంచో ఉంది. పారితోషకం విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటాడని.. డబ్బు కోసం కొన్నిసార్లు చెత్త సినిమాలు కూడా చేస్తుంటాడని అంటారు. స్వయంగా షారుఖే తనకు డబ్బే అన్నింటికంటే ముఖ్యమని.. దాని కోసమే సినిమాలు చేస్తానని అంటుంటాడు. ఐతే షారుఖ్ అందరూ అనుకునేంత డబ్బు మనిషి కాదని అంటున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్. తన కొత్త సినిమా ‘విశ్వరూపం-2’ ప్రమోషన్లలో భాగంగా కమల్.. ఓ హిందీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. షారుఖ్ గొప్పదనమేంటో కూడా వెల్లడించాడు.

కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'హే రామ్'లో షారుఖ్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం షారుఖ్ ఒక్క పైసా పారితోషకం తీసుకోలేదని కమల్ వెల్లడించాడు. తనతో కలిసి నటించాలన్న కోరికతోనే షారుఖ్ ఆ సినిమా చేశాడని.. ముందు పారితోషకం ఇచ్చేట్లు ఒప్పందం కుదిరిందని.. కానీ సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోవడంతో పారితోషకం తీసుకోకూడదని షారుఖ్ నిర్ణయించుకున్నాడని కమల్ వెల్లడించాడు. ఐతే ఈ సినిమాలో నటించినందుకు గాను గుర్తుగా ఒక వాచ్ మాత్రం షారుఖ్‌కు ఇచ్చినట్లు కమల్ వెల్లడించాడు. అంటే కేవలం ఒక వాచ్ కోసం షారుఖ్ ఈ సినిమాలో నటించినట్లు భావించాలన్నాడు. ఐతే సినిమా విడుదల తర్వాత తాను ‘హేరామ్’ హిందీ హక్కుల్ని షారుఖ్ కు రాసి ఇచ్చానన్నాడు. ఇప్పుడు ఆ హక్కుల విలువ ఎంత అన్నది తనకు తెలియదని.. ఒకవేళ అవి వంద కోట్లయినా కూడా అందుకు షారుఖ్ అర్హుడే అని కమల్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు