‘గూఢచారి’ తర్వాతే రంగస్థలం.. మహానటి

‘గూఢచారి’ తర్వాతే రంగస్థలం.. మహానటి

‘గూఢచారి’ టీంను మామూలుగా పొగడలేదు అక్కినేని నాగార్జున. ఈ సినిమా తన లాంటి సీనియర్లు సిగ్గుపడేలా చేసిందని నాగ్ వ్యాఖ్యానించడం విశేషం. తామందరం భారీగా ఖర్చు పెట్టి ఏదేదో చేస్తున్నామని.. కానీ ‘గూఢచారి’ టీం మాత్రం చాలా తక్కువ ఖర్చుతో గొప్ప సినిమా తీసిందని.. సినిమా చూస్తున్నంతసేపూ తాము ఇన్ ఎఫిషియెంటా.. వీళ్లలా సినిమాలు తీయలేమా అన్న అనుమానం కలిగిందని నాగ్ చెప్పాడు. ఈ సినిమా తెలుగు సినిమాకు ఎన్నో పాఠాలు నేర్పిందని.. ఒకప్పుడు ‘శివ’ ఎలాగైతే ఇండస్ట్రీకి స్ఫూర్తిగా నిలిచిందో.. ఇప్పుడు ‘గూఢచారి’ లాంటి సినిమాలు కూడా అంతే స్ఫూర్తినిస్తాయని నాగ్ అన్నాడు. ‘గూఢచారి’ టీం నుంచి తామందరం నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాగ్ అన్నాడు.

ఈ ఏడాది ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్లు రెండే అని.. అవే ‘రంగస్థలం’..'మహానటి' అని.. వాటి తర్వాత ఆ స్థాయి విజయం సాధించింది ‘గూఢచారి’ సినిమానే అని నాగ్ అన్నాడు. కేవలం డబ్బులు ఎంత వచ్చాయి అన్నది మాత్రమే చూడకూడదని.. ఒక సినిమా ఇంపాక్ట్ ఎంత.. అది పరిశ్రమకు ఎలాంటి పాఠాలు నేర్పింది అన్నది కూడా చూడాలని నాగ్ అన్నాడు. ‘గూఢచారి’కి ఉన్న బడ్జెట్.. వనరుల ప్రకారం చూస్తే ఇది సాధించిన విజయం.. ‘రంగస్థలం’.. ‘మహానటి’ విజయాల కన్నా గొప్పదని కూడా నాగ్ కితాబిచ్చాడు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరూ తనను ఆశ్చర్యపరిచారని.. రైటింగ్.. టేకింగ్ అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయని నాగ్ అన్నాడు. తాను చప్పట్లు కొడుతూ.. ఆశ్చర్యపోతూ.. ఉద్వేగానికి గురవుతూ సినిమా చూశానని నాగ్ చెప్పాడు. కొన్ని సీన్లు మైండ్ బ్లోయింగ్ అని.. తాను నమ్మలేకపోయానని అన్నాడు. మొత్తానికి ‘గూఢచారి’ సినిమాను.. ఆ చిత్ర బృందాన్ని నాగార్జున పొగిడిన తీరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు