ఫ్లాప్ హీరోలకు డేట్ కుదిరింది

ఫ్లాప్ హీరోలకు డేట్ కుదిరింది

ఒకప్పుడు అల్లరి నరేష్ కెరీర్ మూడు రిలీజ్‌లు, ఆరు కమిట్మెంట్లు అన్నట్లుగా ఉండేది. అతడితో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ‘సుడిగాడు’ సినిమా తర్వాత అతడి వైభవానికి తెరపడింది. గత ఐదారేళ్లలో రెండంకెల సంఖ్యలో చేశాడు అల్లరోడు. కానీ ఒక్కటీ ఆడలేదు. చివరికి తన శైలికి భిన్నంగా ‘మేడ మీద అబ్బాయి’ అనే వెరైటీ సినిమా చేస్తే అదీ తుస్సుమనిపించింది. ఇక కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ సంగతి చెప్పాల్సిన పని లేదు. హీరోగా మారాక ఆరంభంలో వరుస హిట్లు కొట్టిన అతను తర్వాత గాడి తప్పాడు. ఫ్లాపుల పరంపరతో పూర్తిగా మార్కెట్ కోల్పోయాడు. ఇప్పుడు ఈ ఫ్లాప్ హీరోలిద్దరూ కలిసి ఒక సినిమా చేశారు. అదే.. సిల్లీ ఫెలోస్. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రమిది.

కొన్ని రోజుల కిందటే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తర్వాత ఇది వార్తల్లో లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ఈ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు. సెప్టెంబరు 7న ‘సిల్లీ ఫెలోస్’ ప్రేక్షకుల ముందుకొస్తుందట. దీనికి ముందు వారం ‘శైలజా రెడ్డి అల్లుడు’.. ‘నర్తన శాల’ లాంటి క్రేజీ సినిమాలున్నాయి. తర్వాతి వారం ‘నన్ను దోచుకుందువటే..’.. ‘యు టర్న్’ విడుదలకు ముహూర్తం చూసుకున్నాయి. మధ్యలో ఖాళీ దొరికిన వారంలో ‘సిల్లీ ఫెలోస్’ను షెడ్యూల్ చేశారు. ఇది ఓ తమిళ చిత్రానికి రీమేక్ అని అంటున్నారు. ఇద్దరు హీరోల ట్రాక్ రికార్డు వల్ల ‘సిల్లీ ఫెలోస్’కు ఇప్పటిదాకా ఏమంత పాజిటివ్ బజ్ రాలేదు. పెద్దగా ప్రచారం కూడా చేయకపోవడం కూడా మైనస్ అయింది. ఇకనైనా కొంచెం గట్టిగా ప్రమోషన్లు అవీ చేసి బజ్ పెంచుతారేమో చూడాలి. త్వరలోనే టీజర్ లాంచ్ చేయాలని భీమనేని భావిస్తున్నాడు. అందులో ఏదో ఒక ప్రత్యేకత చూపించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచకుంటే కష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు