బన్నీ సరిపోలేదా.. చిరు కూడానా?

బన్నీ సరిపోలేదా.. చిరు కూడానా?

 విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘గీత గోవిందం’కు ఇప్పటికే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. నిజానికి ఈ సినిమాకు హైప్ తేవడానికి విజయ్‌కి ఉన్న క్రేజ్ సరిపోయింది. పైగా ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాట ఇన్‌స్టంట్ హిట్టయిపోయి.. సినిమా మీద హైప్ ఇంకా పెంచింది. ఇక ‘వాట్ ద ఎఫ్’ పాటకు సంబంధించిన వివాదం కూడా పబ్లిసిటీకి బాగానే పనికొచ్చింది. టీజర్ సైతం సినిమాపై అంచనాల్ని పెంచింది. ఐతే ఈ హైప్ సరిపోదన్నట్లు భారీ ప్రమోషన్ ప్లాన్లతో గీతా ఆర్ట్స్ వాళ్లు చేస్తున్న హంగామా ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్ర ఆడియో వేడుకకు అల్లు అర్జున్‌ను ముఖ్య అతిథిగా రప్పించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాకు బన్నీతో ప్రచారం చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందనే అప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు.

ఐతే బన్నీ సరిపోడన్నట్లు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ సినిమా ప్రమోషన్‌కు పిలిపించబోతుండటం గమనార్హం. ఈ నెల 15న ‘గీత గోవిందం’ విడుదల కాబోతుండగా.. దానికి మూడు రోజుల ముందు ఆంధ్రా ప్రాంతంలో ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. దానికి చిరు ముఖ్య అతిథిగా వస్తారట. అసలే చిరు ‘సైరా’ పనుల్లో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరి కోసం ఈవెంట్లకు రావడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఐతే తన అల్లుడు కళ్యాణ్ దేవ్ అరంగేట్రం చేస్తుండటంతో.. సాయిధరమ్ తేజ్ కెరీర్ స్ట్రగుల్లో ఉండటంతో వాళ్లను ఆదుకోవడానికి ఆయన ఈవెంట్లకు వచ్చారంటే అర్థం ఉంది. అక్కడ ఆయన అవసరం. కానీ ఆల్రెడీ మంచి హైప్ తెచ్చుకున్న ‘గీత గోవిందం’ ఈవెంట్‌కు కూడా ఆయన రావాల్సిన అవసరమేముంది? అయినా ఈ సినిమాకు ఇంత అతి ప్రచారం చేయడం చేటు చేస్తుందేమో అన్నది కూడా కొంచెం చూసుకుంటే మంచిదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు