అడివి శేషే కావాలట.. ఛాన్సిస్తాడట

అడివి శేషే కావాలట.. ఛాన్సిస్తాడట

అడివి శేష్ కథతో ‘క్షణం’ సినిమా తీసిన రవికాంత్ పేరెపు.. ఆ తర్వాత ఇప్పటిదాకా ఇంకో సినిమా తీయలేకపోయాడు. ‘క్షణం’ సినిమాకు అన్నీ తానై నడిపించిన శేష్.. ఆ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ తీసుకున్నాడు. ఆ సినిమా తర్వాత రవికాంత్ ఇంకో సినిమా తీస్తే అతడి టాలెంట్ ఏంటో తెలిసేది. ‘క్షణం’ తర్వాత శేష్ నుంచి వచ్చిన ‘గూఢచారి’ విషయంలోనూ దాదాపుగా ఇలాగే జరుగుతోంది. ఈ చిత్రానికి కూడా శేషే కథ రాశాడు. స్క్రీన్ ప్లేలోనూ భాగస్వామి అయ్యాడు. మరి ఈ చిత్రం తర్వాత దర్శకుడు శశికిరణ్ తిక్క కెరీర్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శేష్ దర్శకుడిగా ఇంతకుముందు తెరకెక్కించిన ‘కర్మ’.. ‘కిస్’ సినిమాలు దారుణ ఫలితాన్నందుకున్నాయి. దాన్ని బట్టి చూస్తే ‘క్షణం’.. ‘గూఢచారి’ సినిమాల్లో దర్శకుల పాత్రను కొట్టి పారేయలేం.

ఐతే బయటి జనాలు ఏమనుకున్నా.. ‘గూఢచారి’ సక్సెస్ క్రెడిట్లో అడివి శేష్‌ కు మేజర్ క్రెడిట్ ఇవ్వడానికి శశికిరణ్ ఏమీ వెనుకాడట్లేదు. ‘గూఢచారి’ తర్వాత తనకు ఇంకో సినిమా ఎలా చేయాలో తెలియట్లేదని.. శేష్‌ తోనే మళ్లీ పని చేయాలని అనిపిస్తోందని అతను చెప్పడం విశేషం. తనకు బేసిగ్గా గొడవలంటే ఇష్టముండదని.. యాక్షన్ సినిమా చేయడం కూడా తనకు తెలియదని.. అలాంటి తనతో ‘గూఢచారి’ లాంటి యాక్షన్ థ్రిల్లర్ చేయించిన ఘతన శేష్ దే అని అతనన్నాడు. యాక్షన్ సన్నివేశాలు ఎలా తీయాలో.. షాట్ మేకింగ్ ఎలాగో కూడా తనకు అవగాహన లేదని.. ‘గూఢచారి’ చేయడానికి ముందు ఇవన్నీ నేర్చుకుని ఆ తర్వాత సినిమా తీశానన్నాడు శశికిరణ్.

తన తర్వాతి సినిమా కోసం ఇంకా ఏ కథా తయారు చేసుకోలేదని.. కొన్ని ఐడియాలు మాత్రం ఉన్నాయని.. నిర్మాతలు సినిమా చేద్దామంటున్నారని.. ఒక సినిమా బయట చేసి మళ్లీ శేష్ తోనే ఇంకో సినిమా చేయాలనుకుంటున్నానని అన్నాడు శశి. మరి అతడికి శేష్ మళ్లీ ఇంకో ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు