రాశి రెడీ.. తెలుగబ్బాయిలు రెడీనా?

రాశి రెడీ.. తెలుగబ్బాయిలు రెడీనా?

ఇప్పటి టాలీవుడ్ హీరోయిన్లు ఒకప్పటి తారల టైపు కాదు. ఉత్తరాది నుంచి వస్తున్న భామలు.. ఏదో మొక్కుబడిగా సినిమాలు చేసి వెళ్లిపోవట్లేదు. ఇక్కడి భాష నేర్చుకుంటున్నారు. ఇక్కడి కల్చర్ అలవాటు చేసుకుంటున్నారు. ఇక్కడి అమ్మాయిల్లా మారిపోతున్నారు. తాను కూడా ఇప్పుడు ఓ తెలుగమ్మాయిలాగా మారిపోయానని అంటోంది రాశి ఖన్నా. సరదాకో అందో.. సీరియస్ గానే అందో కానీ.. తాను ఒక తెలుగబ్బాయినే పెళ్లాడాలని అనుకుంటున్నట్లుగా రాశి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం.

 ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేశాక తనకు కలిగిన భావన ఇదని రాశి చెప్పింది. పెళ్లితో ముడిపడ్డ ఈ చిత్రం చేశాక తెలుగు సంప్రదాయాలపై తనకు చాలా మక్కువ కలిగిందని.. ఒక తెలుగమ్మాయిలా మారిపోయి ఈ సినిమా చేశానని.. అంతే కాక తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించిందని ఆమె చెప్పింది.

నిజానికి ఉత్తరాదిన పెళ్లిళ్లు జరిగే తీరుకి.. ఇక్కడ పెళ్లిళ్లకు చాలా తేడా ఉందని.. అయినప్పటికీ తనకు ఇక్కడి పెళ్లి వ్యవహారాలు సాగే తీరు చాలా నచ్చిందని రాశి చెప్పింది. తాను భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే కచ్చితంగా ‘శ్రీనివాస కళ్యాణం’ గుర్తొచ్చేంతగా ఈ సినిమా తనపై ప్రత్యేకమైన ముద్ర వేసిందని రాశి పేర్కొంది. ‘తొలి ప్రేమ’ తన కెరీర్లో గొప్ప మలుపని.. ఆ చిత్రం చూసే దిల్ రాజు ‘శ్రీనివాస కళ్యాణం’లో ఛాన్స్ ఇచ్చారని.. ఈ సినిమా తర్వాత తనకు మరిన్ని మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం ఉందని ఆమె అంది.

తెలుగులో తాను కొత్తగా ఒక సినిమానే ఒప్పుకున్నానని.. త్వరలోనే దాని వివరాలు వెల్లడిస్తానని.. తమిళంలో మాత్రం ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నానని.. అందులో ముందుగా ‘ఇమైక్క నోడిగల్’ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని రాశి వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు