అరవింద సమేత శాటిలైట్.. కళ్లు చెదిరే డీల్

అరవింద సమేత శాటిలైట్.. కళ్లు చెదిరే డీల్

త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’ మామూలు డిజాస్టర్ కాదు. మొత్తంగా తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా ఇది అప్రతిష్ట మూటగట్టుకుంది. అయితేనేం త్రివిక్రమ్ కొత్త సినిమా ‘అరవింద సమేత’కు ఎంతమాత్రం క్రేజ్ తగ్గలేదు. తొలిసారిగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీస్తున్న ఈ చిత్రానికి ముందు నుంచి పాజిటివ్ బజే ఉంది. దీనికి కళ్లు చెదిరే రీతిలో బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం.

విడుదలకు కొన్ని నెలలుండగానే ఈ చిత్రానికి దాదాపుగా అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయినట్లు తెలుస్తోంది. అన్ని ఏరియాల్లోనూ ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ రేట్లు పలికినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ‘అరవింద సమేత’కు శాటిలైట్ డీల్ పూర్తయినట్లుగా వార్తలొస్తున్నాయి.

జీ టీవీ ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కుల్ని ఏకమొత్తంగా కొన్నట్లు సమాచారం. ఈ డీల్ రూ.23.5 కోట్లకు తెగినట్లు తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ శాటిలైట్ రేటు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం శాటిలైట్ తోనే రూ.23.5 కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఐతే ఇది కేవలం తెలుగు హక్కులకే పరిమితం కాదు. హిందీ రైట్స్ కూడా కలిపి అంత పలికినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య తెలుగు సినిమాల హిందీ శాటిలైట్ హక్కులకు మంచి రేటు పలుకుతోంది. పెద్ద హీరోల సినిమాలు రూ.10 కోట్లకు అటు ఇటుగా ధర పలుకుతున్నాయి. హిందీ ఛానెళ్లలో తెలుగు డబ్బింగ్ సినిమాలు ఇరగాడేస్తున్నాయి. వాటికి అక్కడ మంచి స్పందన వస్తోంది. దీనికి తోడు యూట్యూబ్ లోనూ సినిమాను రిలీజ్ చేసుకుని మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కుల్ని జీ టీవీ అంత పెట్టి కొన్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు