‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఎంత మారిందంటే..

‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఎంత మారిందంటే..

‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత తన జీవితం మామూలుగా మారలేదంటున్నాడు యువ కథానాయకుడు కార్తికేయ. ఈ సినిమా రావడానికి ముందు తాను ఎవరినైతే దగ్గరగా చూస్తే చాలని.. వాళ్ల దగ్గర ఆటోగ్రాఫో ఫొటోగ్రాఫో తీసుకుంటే ఎంతో బాగుంటుందని అనుకున్నానో.. అలాంటి వాళ్లందరూ తనను గుర్తించి అభినందించడం.. ఫోన్లు చేయడం నమ్మలేకపోతున్నానని కార్తికేయ చెప్పాడు. ఒకప్పుడు ఒక అమ్మాయికి తాను పది మెసేజులు పంపితే.. ఆమె నుంచి ఒక మెసేజ్ వచ్చేదని.. కానీ ఇప్పుడు తాను ఒక మెసేజ్ పెడితే.. ఆమె పది మెసేజులు ఇస్తోందని అతనన్నాడు.

అలాగే తాను తన ఫ్రెండు కలిసి ఉన్నపుడు ఎవరైనా అమ్మాయి తమ వైపు చూస్తే.. అరే ఆ అమ్మాయి నా వైపు చూసిందిరా అని గొప్పగా చెప్పుకునేవాళ్లమని.. కానీ ఇప్పుడు తన చుట్టూ అమ్మాయిలు చేరి సెల్ఫీలు దిగుతుంటే.. యు ఆర్ సో సెక్సీ అంటుంటే చాలా సిగ్గేసేస్తోందని అతనన్నాడు. సిటీలో ఎక్కడైనా ఆకలేసి ఏమైనా తిందామని షాపుకు వెళ్తుంటే తన చుట్టూ జనాలు మూగుతున్నారని.. ‘ఆర్ఎక్స్ 100’ హీరో కదా అని అడుగుతున్నారని.. ఇది తనకు చాలా కొత్తగా, ఆశ్చర్యంగా అనిపిస్తోందని చెప్పాడు. ఇక తన ఇంట్లో వాళ్లు కూడా తనను కొత్తగా చూస్తున్నారన్నాడు.

వీడు ఏమైపోతాడో.. ఏమైపోతాడో అని తన తల్లిదండ్రులు తనను చూసి ఏడ్చేవారని.. కానీ ఇప్పుడు ఆనందంతో ఏడుస్తున్నారని.. వాళ్లతో పాటు తన బంధువులందరూ కూడా తనను అదో రకంగా చూస్తున్నారని.. ఒక్క సినిమా తన జీవితంలో ఇంత మార్పు తెస్తుందని తాను ఊహించలేదని చెప్పాడు. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఇలాంటి సినిమా చేయి.. ఇలా కనిపించి.. ఇలాంటి పాట ఉండేలా చూసుకో అని అందరూ చెబుతున్నారని.. కానీ ‘ఆర్ఎక్స్ 100’కు సంబంధించి తన క్రెడిట్ ఏమీ లేదని.. ఇవన్నీ వేరేవాళ్లే చేశారని.. ఎలాంటి సినిమా చేయాలో తన చేతుల్లో ఎలా ఉంటుందని అతనన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు