ఎన్టీఆర్‌ పతనం కూడా చూపించాల్సిందే!

ఎన్టీఆర్‌ పతనం కూడా చూపించాల్సిందే!

ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారనగానే ఆయన జీవితంలోని చివరి అంకాన్ని చూపిస్తారా లేదా అనేదే చర్చకి వచ్చింది. అయితే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎంటర్‌ అయి ముఖ్యమంత్రి అవడంతోనే కథ ముగించాలని బాలకృష్ణ గట్టిగా పట్టుబట్టారని, అంచేత ఇక మిగతా కథ చూపించరని అప్పట్లో వినిపించింది. అయితే క్రిష్‌ దర్శకుడిగా వచ్చిన తర్వాత కథా పరంగా చాలా మార్పులు జరిగాయి. మహానటి చిత్రం స్ఫూర్తితో ఈ చిత్రాన్ని కూడా మరపురాని విధంగా తీర్చిదిద్దడానికి క్రిష్‌ కృషి చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌ పతన దశని చూపించరాదని బాలయ్య పట్టుబట్టినా కానీ అది కూడా చూపిస్తేనే సినిమా రక్తి కడుతుందని, బయోపిక్‌ అథెంటిక్‌గా వుంటుందని చెప్పి క్రిష్‌ కన్విన్స్‌ చేసాడట. మహానటి చిత్రంలో సావిత్రి పడిపోవడాన్ని కూడా చూపించడం వలనే అది అంతగా ఆదరణ పొందిందని, అంచేత ఈ కథలో కీలకమైన భాగాన్ని విడిచి పెట్టరాదని క్రిష్‌ చెప్పాడట. బాలయ్య కూడా ఆ మాటలకి కన్విన్స్‌ అయి లక్ష్మిపార్వతి ఘట్టం, ఎన్టీఆర్‌ పార్టీని కోల్పోవడం వగైరా కూడా వుండేందుకు అంగీకరించాడట.

అయితే వాస్తవాలని యథాతథంగా కాకుండా ఎవరి ఇమేజ్‌కి భంగం వాటిల్లకుండా ఆయా సంఘటనలని తెరకెక్కించబోతున్నారట. ఇదిలావుంటే ఈ చిత్రంపై ఎనలేని క్రేజ్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి ఎనభై కోట్లకి పైగా చెల్లించడానికి కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయంటేనే క్రేజ్‌ ఏ స్థాయిలో వుందనేది తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు