పవన్‌ బయటకి... ఆమె లోనికి!

పవన్‌ బయటకి... ఆమె లోనికి!

సినీ సీమలో జరిగేవి కొన్ని కడు చిత్రంగా వుంటాయి. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో పరిచయమైన చిరంజీవి తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ పెద్ద స్టార్‌గా ఎదిగితే, నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ ఒక్క సినిమాతోనే కనుమరుగైంది. ఇరవయ్యేళ్లలో పవన్‌ నంబర్‌వన్‌ హీరోగా ఎదిగితే, సుప్రియ తెర వెనుక వ్యవహారాలు చూసుకోవడంతోనే సరిపోయింది. కట్‌ చేస్తే... 2018లోకి వచ్చేసరికి పవన్‌ సినిమాలకి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు.

సుప్రియ మాత్రం ఇరవై రెండేళ్ల తర్వాత మళ్లీ తెర మీద కనిపించి 'గూఢచారి'తో హిట్‌ దక్కించుకుంది. ఏదో సరదాగా ఈ సినిమాలో నటించలేదని, నటనపై ఆసక్తి వున్నదని, ఇకపై కూడా మంచి పాత్రలు వస్తే తప్పక నటిస్తానని సుప్రియ చెబుతోంది. గూఢచారి చిత్ర విజయంలో క్రెడిట్‌ తనకి దక్కేలా మీడియాతో బాగా ఇంటరాక్ట్‌ అవుతోంది. నిజానికి ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శోభిత దూళిపాళ కంటే కూడా సుప్రియ ఎక్కువ హైలైట్‌ అవుతోంది.

ఒకే సినిమాతో పరిచయమైన పవన్‌, సుప్రియల కెరియర్‌ విషయంలో జరిగిన విశేషాల గురించి ఇండస్ట్రీలో బాగా చర్చించుకుంటున్నారు. ఇక్కడ అబ్బాయి ఎక్కడికో వెళ్లిపోతే, అక్కడెక్కడో వున్న అమ్మాయి తిరిగి తెర మీదకి వచ్చేసిందని కామెంట్‌ చేస్తున్నారు. ఇది నిజంగానే సినీ ఫక్కీలో జరిగిన కో ఇన్సిడెన్స్‌లానే అనిపిస్తోంది కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు