‘గూఢచారి’లో అన్నీ బాగున్నాయ్ కానీ..

‘గూఢచారి’లో అన్నీ బాగున్నాయ్ కానీ..

గత శుక్రవారం విడుదలైన ‘గూఢచారి’ మంచి టాక్ తెచ్చుకుని.. చక్కటి వసూళ్లతో సాగిపోతోంది. ఈ సినిమాకు ఇటు విమర్శకుల నుంచి అటు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. ఆరంభం నుంచి చివరి దాకా కథతో పాటే సినిమా నడవడం.. వృథాగా ఒక్క సీన్ కూడా లేకపోవడంతో.. ప్రతిదీ కథతో ముడిపడి ఉండటం.. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగడం ప్రేక్షకులకు నచ్చుతోంది. తెలుగులో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు.

అలాగని ఈ చిత్రంలో లోపాలు లేవని కాదు.. ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ‘గూఢచారి’ ఇంకా గొప్ప సినిమా అయ్యుండేదే. ‘గూఢచారి’లో కథను నడిపించేది హీరో కాదు. కథ కూడా అతడి చుట్టూ తిరగదు. విలన్ అయిన హీరో తండ్రి ఆడిన గేమ్‌లో అతను పావు అవుతాడు. అతను చిక్కుల్లో పడేశాక దాన్ని ఛేదించడానికి పోరాటం చేస్తాడు. చివరికి చిక్కుల నుంచి బయటపడి విలన్ పని పడతాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది హీరో పర్సనల్ స్టోరీ.

నిజానికి దీని ట్రైలర్ అదీ చూస్తే.. హీరోకు ఒక పెద్ద మిషన్ ఉంటుందని.. అతను దేశం కోసం పెద్ద ఘనతో ఏదో సాధిస్తాడని అనుకుంటాం. కానీ ఈ కథ ఆ రకంగా సాగదు. హీరో-అతడి తండ్రి మధ్య కథ నడవడం వల్ల దీని పరిధి చాలా చిన్నదైపోయింది. అసలు సినిమాలో ‘త్రినేత్ర’ అనే మిషన్ ఎందుకు పెడతారు.. హీరో అండ్ టీం ఏ లక్ష్యంతో ట్రైన్ అవుతారు.. వాళ్ల తర్వాతి మిషన్ ఏంటన్నది స్పష్టంగా ఉండదు. విలన్ అతను టార్గెట్ చేసి.. ట్రాప్‌లో వేస్తే దాన్ని అతను ఛేదించడమే ఈ సినిమా. ఇలాంటివి ఉపకథలైతే బాగుంటుంది కానీ.. ఇదే ప్రధాన కథగా మారడం ‘గూఢచారి’లోని లోపం. ఐతే ‘గూఢచారి’ ఆరంభం నుంచి చాలా ఆసక్తికరంగా సాగిపోవడం వల్ల.. ఉత్కంఠ రేకెత్తించడం వల్ల ఆ కథలోని లోపాల్ని.. బలహీనతల్ని మరిచిపోతారన్నది వాస్తవం. అలా కాకుండా ఈ కథ పరిధి పెద్దగా ఉండి.. హీరోకు పెద్ద మిషన్ ఉండి ఉంటే సినిమా ఇంకో రేంజికి వెళ్లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు