బాక్సాఫీస్ ఫైటర్స్.. ఎంత మంచి స్నేహమో

బాక్సాఫీస్ ఫైటర్స్.. ఎంత మంచి స్నేహమో

ఇండస్ట్రీలో వేరొకరి సినిమా హిట్టయితే సంతోషించే వాళ్లకంటే ఫ్లాపైతే ఎగిరి గంతేసే వాళ్లే ఎక్కువ మంది అంటుంటారు. అందులోనూ తమ సినిమాకు పోటీగా ఇంకోటి రిలీజవుతుంటే ఆడి ఫ్లాప్ అవ్వాలని.. తమది మాత్రమే హిట్టవ్వాలనే ఆశిస్తుంటారు. ఐతే ఈ మధ్య టాలీవుడ్లో ట్రెండు మారుతోంది. ఇంతకుముందు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న స్టార్ హీరోలే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంటడంతో ఇక మీడియం.. చిన్న స్థాయి సినిమాలు చేసే వాళ్లు మరింతగా కలిసిపోతున్నారు.

ఒకరి సినిమా గురించి ఇంకొకరు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ప్రమోషన్లలోనూ ఒకరికొకరు బాగా సహకరించుకుంటున్నారు. పోటీగా రెండు సినిమాలు రిలీజవుతుంటే.. ఒక దాని గురించి ఇంకొకరు సానుకూలంగా మాట్లాడుతున్నారు. రెండూ బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. గత ఏడాది క్రిస్మస్ టైంలో ‘హలో’ గురించి నాని అండ్ కో.. ‘ఎంసీఏ’ గురించి నాగార్జున అండ్ టీం ఎంత పాజిటివ్‌గా మాట్లాడాయో తెలిసిందే.

ఇప్పుడు గత శుక్రవారం రిలీజైన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ చిత్ర బృందాలైతే చక్కగా రెండు సినిమాల్నీ కలిసి ప్రమోట్ చేసుకుంటూ సాగిపోతున్నాయి. ఈ రెండు టీంలకు చెందిన సభ్యులు ఒకేసారి బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి తమ సినిమాల్ని ప్రమోట్ చేయడం విశేషం. ఇక విడుదలకు ముందు ఈ సినిమా గురించి వాళ్లు.. ఆ సినిమా గురించి వీళ్లు ట్వీట్లు పెట్టారు. రెండూ బాగా ఆడాలని ఆకాంక్షించారు. తాజాగా ‘చి ల సౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అయితే.. ‘గూఢచారి’తో శేష్ పెద్ద స్టార్ అయిపోయాడని.. తమ రెండు సినిమాల్లోనూ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడని కితాబిచ్చాడు.

వీళ్లు వీళ్లు ఫ్రెండ్స్ కాబట్టి పరస్పరం సహకరించుకోవడం, పాజిటివ్‌గా మాట్లాడ్డం ఓకే.. కానీ ‘చి ల సౌ’ను తన బేనర్లో రిలీజ్ చేసిన అక్కినేని నాగార్జున సైతం ‘గూఢచారి’ గురించి పాజిటివ్ ట్వీట్ వేయడం.. మస్ట్ వాచ్ అని చెప్పడం విశేషమే. మొత్తానికి టాలీవుడ్లో వస్తున్న ఈ సానుకూల మార్పు పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మిగతా వాళ్లు కూడా సాగిపోవాలని సూచిస్తున్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English