మళ్లీ క్రెడిట్ మొత్తం హీరోకేనా?

మళ్లీ క్రెడిట్ మొత్తం హీరోకేనా?

రెండేళ్ల కిందట అడివి శేష్ హీరోగా వచ్చిన ‘క్షణం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రానికి కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లేలోనూ పాలు పంచుకున్నాడు శేష్. ఈ చిత్రంతోనే రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఐతే సినిమా సక్సెస్ క్రెడిట్లో మేజర్ షేర్ శేష్‌కే వచ్చింది. కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లేలోనూ భాగస్వామి కావడం.. సినిమాకు విడుదలకు ముందు, తర్వాత ప్రమోషన్లలో ఎక్కడ చూసినా అతనే కనిపించడం.. సినిమా మేకింగ్ గురించి కూడా అతనే అన్ని చోట్లా మాట్లాడటంతో ఈ చిత్రానికి దర్శకుడు రవికాంతే అయినా.. శేష్ అన్నీ తానై వ్యవహరించాడన్న భావన అందరికీ కలిగింది. దీంతో రవికాంత్ గురించి పెద్ద డిస్కషన్ జరగలేదు. ఈ యువ దర్శకుడు ఆ తర్వాత వెంటనే మరో సినిమా తీసి తనేంటో రుజువు చేసుకుని ఉంటే కథ మరోలా ఉండేదేమో. కానీ ‘క్షణం’ విడుదలై రెండున్నరేళ్లు దాటినా ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను రవికాంత్ అనౌన్స్ కూడా చేయలేదు.

ఇప్పుడు శేష్ నుంచి ‘గూఢచారి’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు కూడా అతనే కథ అందించాడు. స్క్రీన్ ప్లేలోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్లలోనూ శేషే కనిపించాడు. సినిమా గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ శేష్ గురించే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. కేవలం నటన వరకు ఆ డిస్కషన్లు పరిమితం కావడం లేదు. రచయితగా అతడి ప్రతిభనూ కొనియాడుతున్నారు. దర్శకుడు శశికిరణ్ ప్రస్తావన చివర్లో నామమాత్రంగా తెస్తున్నారు. శశి ముందు నుంచి సైలెంటుగా.. రిజర్వ్‌డ్‌గా ఉంటున్నాడు. ప్రమోషన్లలో ఎక్కడా ప్రముఖంగా కనిపించలేదు. శేష్ మాట్టాడుతున్నపుడు దర్శకుడికి బాగానే క్రెడిట్ ఇస్తున్నప్పటికీ కూడా ‘క్షణం’ తరహాలోనే ‘గూఢచారి’కి కూడా శేష్ అన్నీ తానై వ్యవహరించాడన్న అభిప్రాయం జనాల్లో బలపడిపోయింది. అందుకే అతడికే ప్రశంసలన్నీ దక్కుతున్నాయి. మరి శశికిరణ్.. రవికాంత్ బాటలోనే కనుమరుగైపోతాడా.. సొంతంగా ఇంకో మంచి సినిమా తీసి తనేంటో రుజువు చేసుకుంటాడా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English