మారుతి బ్రాండా.. అయ్యబాబోయ్

మారుతి బ్రాండా.. అయ్యబాబోయ్

నా సినిమాలకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది అంటూ ‘బ్రాండ్ బాబు’ సినిమా విడుదలకు ముందు ఘనంగా స్టేట్మెంట్ ఇచ్చాడు దాసరి మారుతి. ఐతే ‘బ్రాండ్ బాబు’ చూసిన జనాలు మాత్రం మారుతి బ్రాండ్ అంటే చాలా చీప్ అని అర్థమా అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి దర్శకుడిగా.. రచయితగా మారుతికి మొదట్లో ఒక బ్రాండ్ ఉన్న మాట వాస్తవం. యూత్‌కు బాగా కనెక్టయ్యేలా సినిమాలు తీయగలడని అతడికి పేరుండేది.

బూతులు.. డబుల్ మీనింగ్ డైలాగుల డోస్ బాగా పెంచి.. యూత్‌ను టార్గెట్ చేయడం అతడి సినిమాల్లో కనిపించేది. ‘ఈ రోజుల్లో’.. ‘బస్ స్టాప్’ లాంటి సినిమాల్లో ఈ విషయం గమనించవచ్చు. ఆ తర్వాత దర్శకుడిగా తన సినిమాల్లో మార్పు చూపించినప్పటికీ.. రచయితగా, నిర్మాతగా తీసిన సినిమాల్లో మాత్రం ఇదే ఒరవడిని కొనసాగించాడు. ఐతే అతడి సినిమాలు ఓ మోస్తరుగా ఆడినంత వరకు పరిస్థితి బాగానే ఉంది.

కానీ తర్వాత వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవడంతో మారుతి బ్రాండ్ వాల్యూ పడిపోయింది. చాలా గ్యాప్ తీసుకుని రెండేళ్ల కిందట మారుతి ‘రోజులు మారాయి’ అనే సినిమాకు స్క్రిప్టు అందించాడు. సమర్పకుడిగా వ్యవహరించాడు. అది దారుణ ఫలితాన్నందుకుంది. మళ్లీ ఈసారి ఇంకొంచెం గ్యాప్ తీసుకుని ‘బ్రాండ్ బాబు’తో వచ్చాడు. ఈ సినిమా మరీ పేలవంగా ఉండటంతో ఏ కాస్తో ఉన్న మారుతి బ్రాండ్ వాల్యూ పూర్తిగా పోయింది. మారుతి సినిమా అంటే చీప్ అన్న అభిప్రాయం జనాలకు కలిగించింది ఈ చిత్రం.

ఇందులో మూల కథ బాగానే ఉన్నా.. ఓవరాల్ స్క్రిప్టు మాత్రం చెత్తగా అనిపిస్తుంది. దర్శకుడిగా తన సినిమాల్లో బాగానే క్వాలిటీ చూపించే మారుతి.. ఇలాంటి స్క్రిప్టు ఎలా రాశాడబ్బా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. మారుతి రాతే అంతంతమాత్రం అంటే ఇక దాన్ని దర్శకుడు ప్రభాకర్ చిత్రీకరించిన తీరు మరీ పేలవం. దీంతో ‘బ్రాండ్ బాబు’ దారుణ ఫలితాన్నందుకుంది. దీంతో ఇకపై  సినిమా పోస్టర్ మీదైనా మారుతి ప్రెజెంట్స్ అనో.. రిటన్ బై మారుతి అనో కనిపిస్తే జనాలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్తుల్లో మారుతి పేరుతో వచ్చే సినిమాకు కనీస స్పందన అయినా ఉంటుందా అన్నది సందేహమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు