ఇంకో ‘క్షణం’ రాబోతోంది

ఇంకో ‘క్షణం’ రాబోతోంది

టాలీవుడ్ చరిత్రలోనే గొప్ప థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచిపోయే సినిమా ‘క్షణం’. రెండేళ్ల కిందట వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చింది. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని కంటెంట్‌తో మెస్మరైజ్ చేసింది. భారీ చిత్రాలకు పేరు పడ్డ పీవీపీ సినిమా.. తొలిసారిగా చాలా తక్కువ బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించింది. అద్భుత ఫలితాన్నందుకుంది.

ఇప్పుడు ఇదే బేనర్లో ‘క్షణం’ హీరో కమ్ రైటర్ అడివి శేష్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ‘క్షణం’ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని.. శ్రద్ధంగా ‘గూఢచారి’ సినిమా చేసిన శేష్.. దీని తర్వాత తన సొంత కథతో చేయబోయే కొత్త సినిమా ఇదే. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టిన శేష్.. డైరెక్షన్ ఎవరితో చేయిద్దామా అని చూస్తున్నట్లు సమాచారం.

రెండు వరుస హిట్లతో శేష్ మార్కెట్ బాగానే పెరిగిన నేపథ్యంలో శేష్ మీద ఈసారి ఎక్కువ బడ్జెట్టే పెట్టబోతోందట పీవీపీ బేనర్. శేష్ ఈసారి కొంచెం పేరున్న కథానాయికతోనే జోడీ కట్టబోతున్నాడు. కొన్నేళ్ల కిందట తెలుగులో వరుసగా సినిమాలు చేసి ఇప్పుడు కోలీవుడ్‌కు పరిమితం అయిపోయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా కసాండ్రా అతడితో జత కట్టబోతోందట.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత నిర్మాణానికి దూరం అయిపోయిన పీవీపీ.. కొంచెం లేటుగా మహేష్ 25వ సినిమాలో భాగస్వామి అయ్యారు. కానీ అందులో ఆయన యాక్టివ్ పార్టనర్‌ కాదు. పీవీపీ ఫోకస్ ప్రస్తుతం శేష్ సినిమా మీదే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ‘గూఢచారి’తో శేష్ ఇమేజ్ ఎంతో పెరిగింది. ‘క్షణం’ విజయం గాలివాటం కాదని రుజువు చేస్తూ ‘గూఢచారి’తో గన్ షాట్ హిట్ కొట్టి తనేంటో మరోసారి రుజువు చేసుకున్నాడతను. ‘క్షణం’ కాంబినేషన్లో రాబోయే చిత్రంపై అంచనాలు భారీగానే ఉంటాయనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English