యుఎస్ బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపొచ్చింది

యుఎస్ బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపొచ్చింది

ఎప్పుడో మూడు నెలల కిందట వచ్చిన ‘మహానటి’తో ఆఖరు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా కూడా యుఎస్ బాక్సాఫీస్ కు ఊపు తేలేకపోయింది. ‘సమ్మోహనం’ లాంటి ఒకటీ అరా సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. మిగతా చిత్రాలన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలన వసూళ్లు రాబట్టిన ‘ఆర్ఎక్స్ 100’ సైతం అమెరికాలో తుస్సుమనిపించింది.

ఐతే ఎట్టకేలకు యుఎష్ తెలుగు బాక్సాఫీస్‌కు కొంచెం కళ వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ‘గూఢచారి’ అక్కడ అదరగొడుతోంది. ప్రిమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. శనివారానికే 3 లక్షల డాలర్ల మార్కును దాటేసింది. వీకెండ్లో దాదాపుగా హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసేలా కనిపిస్తోంది.

ఫుల్ రన్లో ఈ చిత్రం ముప్పావు మిలియన్ మార్కును అందుకునే అవకాశాలు లేకపోలేదు. రూ.6 కోట్ల లో బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ఈ చిత్రం పెట్టుబడిని వెనక్కి తెచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు ‘చి ల సౌ’ సైతం అమెరికాలో బాగానే ఆడుతోంది. ఆ చిత్రం లక్ష డాలర్ల మార్కును దాటింది.
మరోవైపు ‘బ్రాండ్ బాబు’ మాత్రం తీవ్ర నిరాశకు గురి చేసింది. అమెరికాలో ఈ చిత్రాన్ని నామమాత్రంగా రిలీజ్ చేస్తే అక్కడ దాదాపుగా కలెక్షన్లు నిల్ అంటున్నారు. ఒకటీ అరా టికెట్లు తెగడం కూడా కష్టంగానే ఉంది. వచ్చే వారం రాబోతున్న ‘శ్రీనివాస కళ్యాణం’.. ‘విశ్వరూపం’ చిత్రాలకు కూడా యుఎస్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘శ్రీనివాస కళ్యాణం’కు పాజిటివ్ టాక్ వస్తే మిలియన్ మార్కును అందుకునే ఛాన్సుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు