700 మందిని ఆడిషన్ చేసిన డైరెక్టర్

ఒక పాత్ర కోసం ఐదు మందినో పది మందినో ఆడిషన్ చేయడం మామూలే. కానీ ఒక దర్శకుడు ఏకంగా 700 మందిని ఆడిషన్ చేసి.. అందులోంచి 24 మందిని ఎంపిక చేసుకోవడం.. వారికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చాక సినిమా మొదలుపెట్టడం అరుదైన విషయమే. ‘సీటీమార్’ కోసం ఇలాగే చేశానని అంటున్నాడు యువ దర్శకుడు సంపత్ నంది.

ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. కబడ్డీ మీద తనకు చిన్నప్పట్నుంచి ఆసక్తి ఉందని.. తాను కూడా కబడ్డీ ఆడానని.. ఐతే ప్రొ కబడ్డీ లీగ్ చూస్తున్నపుడు తనకు కబడ్డీ నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన పుట్టిందని.. ఆ తర్వాత ‘సీటీమార్’ కథ రాశానని సంపత్ వెల్లడించాడు. ఐతే ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్లుగా కనిపించే 24 మందిని ఎంచుకోవడం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదని ఓ ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.

ఈ 24 మంది కోసం 700 మందిని ఆడిషన్ చేసినట్లు సంపత్ తెలిపాడు. నటన వచ్చి.. కబడ్డీ మీద అంతో ఇంతో అవగాహన ఉన్న వాళ్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమైందని అతను చెప్పాడు. చివరికి జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడిన నలుగురు క్రీడాకారుల్ని ఈ సినిమా కోసం తీసుకున్నామని.. వాళ్లకు మూడు నెలలు నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో నటింపజేశామని వెల్లడించాడు.

ఆడిషన్ పూర్తయ్యాక కబడ్డీ శిక్షణ కోసం మూణ్నాలుగు నెలలు కేటాయించామని.. గేమ్ గురించి లోతుగా తెలుసుకుని.. ఒక అథెంటిక్ స్పోర్ట్స్ మూవీలా ‘సీటీమార్’ను తీర్చిదిద్దడానికి ప్రయత్నించామని సంపత్ తెలిపాడు. ఐతే సినిమాలో కేవలం కబడ్డీ మాత్రమే ఉండదని… అంతకుమించి ఎమోషన్, యాక్షన్ ఉంటుందని అతనన్నాడు. తన కెరీర్లోనే ఎంతో కష్టపడి తీసిన చిత్రమిదని.. ‘సీటీమార్’ కచ్చితంగా ప్రేక్షకుల అంచనాల్ని మించి విజయం సాధిస్తుందని.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చాలా రోజులు ఎదురు చూసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని సంపత్ చెప్పాడు.