కమల్‌ను వెంటాడుతున్న ‘మర్మయోగి’

కమల్‌ను వెంటాడుతున్న ‘మర్మయోగి’

లోక నాయకుడు కమల్ హాసన్.. చాలా ఏళ్ల కిందట ‘మర్మయోగి’ అనే సినిమా తీయాలనుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం మన విక్టరీ వెంకటేష్‌ను కూడా సంప్రదించాడు. అప్పట్లోనే ఈ చిత్రానికి రూ.100 కోట్ల బడ్జెట్ అనుకున్నాడు కమల్. స్క్రిప్టు ఓకే అయి ఇక సినిమా సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఆగిపోయింది.

ఆ తర్వాత అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయారు. ఐతే ఇప్పుడు కమల్ కొత్త సినిమా  ‘విశ్వరూపం-2’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ‘మర్మయోగి’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆ సినిమా కోసం కమల్ హాసన్ తమ దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లించలేదని.. వడ్డీతో కలిసి తమకు రావాల్సిన మొత్తం చెల్లించే వరకు ‘విశ్వరూపం-2’ విడుదల కానివ్వబోమని పిరమిడ్‌ సైమిర ప్రొడక్షన్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అంటోంది.

ఈ మేరకు ఆ సంస్థ కోర్టులో కేసు వేసింది. ‘మర్మయోగి’ సినిమా నిర్మాణ పనుల కోసం తమ సంస్థ 2016లో రూ.5.44 కోట్లు కమల్‌కు ఇచ్చిందని ఆసంస్థ ఫిర్యాదులో తెలిపింది. ఈ మేరకు 2008 ఏప్రిల్‌ 2న రాజ్‌కమల్‌‌ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటూ సంతకాలు కూడా చేసినట్లు చెప్పింది. 2016లో రూ.5.44 కోట్లు ఇచ్చామని, ఇప్పుడు వడ్డీతో కలిపి మొత్తం రూ.7.75 కోట్లు అయ్యిందని పేర్కొంది.

ఇది ఓ కొలిక్కి రాకుండా ‘విశ్వరూపం 2’ విడుదల కాకూడదని.. దీని విడుదలపై స్టే విధించాలని దావాలో పేర్కొంది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి కమల్‌కు నోటీసులు పంపారు. సోమవారం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సినీ నిర్మాతలతో ఇలాంటి పేచీలేవైనా ఉంటే.. సరిగ్గా ఆ నిర్మాత కొత్త సినిమా విడుదలకు ముందు ఇలా కోర్టుకెక్కి వివాదాన్ని పరిష్కరించుకోవడం ఫైనాన్షియర్లకు అలవాటే. మరి కమల్ సదరు సంస్థతో వివాదాన్ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు