సింగిల్ థియేటర్లో ‘ఆర్ఎక్స్’ సంచలనం

సింగిల్ థియేటర్లో ‘ఆర్ఎక్స్’ సంచలనం

‘ఆర్ఎక్స్ 100’ సినిమా విడుదలై మూడు వారాలు దాటిపోయింది. దీని తర్వాత వచ్చిన  చాలా సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. కానీ ఈ చిత్రం మాత్రం ఇప్పటికే ఓ మోస్తరు షేర్ రాబడుతూ ఆశ్చర్యపరుస్తోంది. రెండు తెలుగు రాస్ట్రాల్లో ఈ సినిమాను చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు ఆడిస్తున్నాయి.

ఈ శుక్రవారం విడుదలైన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో దీని జోరు తగ్గుతుందేమో చూడాలి. ఐతే ఈ వారాంతంతో ‘ఆర్ఎక్స్ 100’ జోరుకు తెరపడ్డా కూడా ఇప్పటిదాకా ఈ సినిమా సాధించిన దాంతో నిర్మాతలు.. బయ్యర్లు ఫుల్ ఖుషీనే. రూ.2 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ.12 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.

‘ఆర్ఎక్స్ 100’ కేవలం ఒక థియేటర్లోనే రూ.50 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఆ థియేటర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70 ఎంఎం. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఫేమస్ అయిన.. అతి పెద్దదైన థియేటర్లలో దేవి ఒకటి. భారీ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్లో హౌస్ ఫుల్ పడితే ఒక షోకే రూ.1.35 లక్షల గ్రాస్ వస్తుంది. ఇక్కడ తొలి వారం హౌస్ వసూళ్లతో సాగిన ఈ చిత్రం రూ.28 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసి అబ్బురపరిచింది.

ఆ తర్వాత కూడా ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తూ రూ.50 లక్షల మార్కును కూడా దాటింది. ఒక థియేటర్లోనే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిన సినిమాలున్నాయి కానీ.. ఇలాంటి చిన్న సినిమా ఈ మార్కును అందుకోవడం విశేషమే. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఎక్స్ 100’లో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు