ఆ సినిమా టీంను త్రిష మళ్లీ కెలికింది

ఆ సినిమా టీంను త్రిష మళ్లీ కెలికింది

ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే చాలా సమీకరణాలు కలిసి రావాలి. స్క్రిప్టు అందరికీ నచ్చాలి. అందరి డేట్లూ సర్దుబాటు కావాలి. ఎంతో ప్లానింగ్ ఉంటే తప్ప సినిమా సెట్స్ మీదికి వెళ్లదు. ఇలా అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక ఒక ఆర్టిస్టు తనకు కథ నచ్చలేదనో.. పాత్ర బాలేదనో సినిమా నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుంది..? సీనియర్ హీరోయిన్ త్రిష అదే పని చేసింది. విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సామి స్క్వేర్’ నుంచి అనూహ్యంగా తప్పుకుంది.

దశాబ్దంన్నర కిందట విక్రమ్-త్రిష కాంబినేషన్లోనే తెరకెక్కిన ‘సామి’కి ఇది సీక్వెల్. త్రిష కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్ తీస్తూ మళ్లీ త్రిషకే అవకాశం ఇచ్చాడు దర్శకుడు హరి. కానీ సినిమా చిత్రీకరణ మొదలు కాబోతుండగా.. ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చింది త్రిష. తప్పుకుంటే తప్పుకుంది కానీ.. పాత్ర నచ్చలేదని ఓపెన్‌గా ప్రకటించడం చిత్ర బృందానికి ఆగ్రహం తెప్పించింది.

ఐతే ఎప్పుడో ముగిసిపోయిన వ్యవహారాన్ని త్రిష ఇప్పటికీ వదల్లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘సామి స్క్వేర్’ నుంచి తప్పుకోవడం గురించి ప్రశ్నిస్తే మళ్లీ అదే మాట చెప్పింది. ఈ సినిమాలో తన పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోవడంతోనే తప్పుకున్నానని.. చిత్రీకరణకు కూడా వెళ్లలేదని అంది. ‘సామి స్క్వేర్’లో ఇద్దరు కథానాయికలకు చోటుంది. త్రిషతో పాటు కీర్తి సురేష్‌కు కూడా అవకాశమిచ్చారు. ఇప్పుడు మాంచి ఊపుమీదున్న కీర్తికి ఎక్కువ నిడివి ఉన్న పాత్ర ఇచ్చి.. పాటలు కూడా ఎక్కువ పెట్టడంతో త్రిష నొచ్చుకుందని.. అందుకే ఆమె తప్పుకుందని అంటున్నారు. ఇదే నిజమైతే ముందు ఆ పాత్రకు ఎందుకు ఓకే చెప్పినట్లు.. తర్వాత ఎందుకు తప్పుకున్నట్లు? త్రిష స్థానంలోకి ఐశ్వర్యా రాజేష్ అనే చిన్న హీరోయిన్ వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు