సభకు నమస్కారం.. దిల్ రాజు తిరస్కారం

 సభకు నమస్కారం.. దిల్ రాజు తిరస్కారం

సభకు నమస్కారం.. రెండు రోజులుగా ఈ టైటిల్ టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. ఈ టైటిల్ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది. మీడియాలోనూ ఈ పేరు నానుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ టైటిల్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ టైటిల్ మార్మోగింది.

ఐతే ఈ హాట్ రూమర్‌పై నీళ్లు చల్లేశాడు దిల్ రాజు. తాను ఈ పేరుతో సినిమా ఏదీ తీయడం లేదని దిల్ రాజు స్పష్టం చేశాడు. ఇది ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని.. బన్నీతో సినిమా చేయడం లేదని.. ఏదైనా ఉంటే తానే ప్రకటన చేస్తానని దిల్ రాజు స్పష్టం చేశాడు.

‘సభకు నమస్కారం’ అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉండటం.. బన్నీ-రాజు కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండటంతో ఈ రూమర్ చాలా వేగంగా స్ప్రెడ్ అయింది. కానీ రాజు తిరస్కారంతో అందరూ చల్లబడిపోయారు. ఇంతకుముందు బన్నీతో రాజు.. ‘ఆర్య’.. ‘పరుగు’ లాంటి హిట్ మూవీస్ తీశారు. వీళ్లిద్దరి కలయికలో చివరగా వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ తెచ్చింది. ‘డీజే’ తర్వాత బన్నీ చేసిన ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో తన తర్వాతి సినిమా విషయంలో బన్నీ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మొదలుపెట్టాల్సిన సినిమాను హోల్డ్‌లో పెట్టాడు. స్క్రిప్టు తనకు పూర్తి సంతృప్తి ఇచ్చాకే సినిమా మొదలుపెట్టాలనుకుంటున్నాడు. వేరే కథలు కూడా వింటున్నాడు. అతను సినిమా మొదలుపెట్టడానికి ఇంకొన్ని నెలలు పడుతుందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు