కమల్ సార్.. ఏమిటీ కన్ఫ్యూజన్

కమల్ సార్.. ఏమిటీ కన్ఫ్యూజన్

తమిళ సినీ పరిశ్రమలో లెజెండ్ స్టేటస్ అందుకున్న నటులు రాజకీయాల వైపు చూడటం కొత్తేమీ కాదు. రజనీకాంత్.. కమల్ హాసన్ సైతం ఈ బాటలోనే నడుస్తున్నారు. వీళ్లిద్దరూ ఒకేసారి రాజకీయాల వైపు చూశారు. కమల్ ఆల్రెడీ పార్టీ కూడా పెట్టేశాడు. రజనీ త్వరలోనే పార్టీ పేరు ప్రకటించబోతున్నాడు. వీళ్లిద్దరూ కూడా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు చేయడం సందేహమే అని భావిస్తున్నారు.

ఐతే ఈ విషయంలో కమల్ హాసన్ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాతుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. ముందు అయన రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల్లో నటించనని అన్నారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. కానీ ఇటీవలే ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను రూపాయి జీతం తీసుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నానని.. అది కష్టమైన విషయమని.. కానీ కాబట్టి సినిమాలు వదులుకోనని అన్నారు.

అంటే ఎన్నికల సమయం వరకు సినిమాలకు దూరమై.. మళ్లీ కమల్ నటన వైపు చూస్తాడేమో అనుకున్నారు. కానీ తాజాగా ‘విశ్వరూపం-2’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన కమల్.. మాట మార్చేశాడు. ఇకపై తన జీవితం రాజకీయాలకే అంకితం అని.. సినిమాలు చేయనని.. తనకెంతో ఇచ్చిన ప్రజలకు తిరిగి ఎంతో కొంత ఇవ్వడం తన కర్తవ్యమని కమల్ అన్నాడు. మళ్లీ ఇంతలోనే యు టర్న్ తీసుకుని కమల్ కొత్త మాట చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి మీ కథలతో వేరే వాళ్లను పెట్టి సినిమాలు తీస్తారా  అని అడిగినా కూడా కమల్ లేదనే సమాధానం ఇవ్వడం విశేషం.

ఇన్ని కోట్ల మంది ఉన్న ఇండియాలో తనలాంటి ప్రతిభావంతులైన నటీనటులు వేలల్లో ఉన్నారని.. వాళ్లకంటూ ప్రత్యేకమైన కథలు వెతుక్కుంటూ వస్తాయని.. వాళ్ల సినిమాలు వాళ్లను చేసుకోనివ్వాలని కమల్ అన్నాడు. మరి ఇకపై సినిమాలు చేయనన్న మాటకు ఈసారైనా కమల్ కట్టుబడతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English