నాగ్ అనౌన్స్ చేయబోయే సినిమా ఏది?

నాగ్ అనౌన్స్ చేయబోయే సినిమా ఏది?

అక్కినేని నాగార్జున కేవలం తెలుగు నటుడు మాత్రమే కాదు.. ఆయనకు హిందీ సినిమాల్లో.. తమిళ చిత్రాల్లోనూ నటించిన అనుభవం ఉంది. ఐతే కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకే పరిమితం అయిపోయారు. దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత ఆయన హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో పాటుగా త్వరలోనే తమిళంలో ఒక సినిమా చేయబోతున్నట్లు నాగ్ వెల్లడించాడు. కానీ ఆ సినిమా ఏదో మాత్రం చెప్పలేదు. అది పెద్ద ప్రాజెక్టే అని.. ఇంకో వారం రోజుల్లో దాని గురించి అనౌన్స్ చేస్తానని నాగ్ తెలిపాడు. నాగ్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే అది స్పెషల్ ప్రాజెక్టే అనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో నాగ్ నటిస్తాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

ధనుష్ ఇప్పటికే దర్శకుడిగా ‘పవర్ పాండి’ అనే సినిమా చేశాడు. ఆ తర్వాత ఒక భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడని.. హీరోగా నాగార్జునను ఎంచుకుంటున్నాడని.. అది ద్విభాషా చిత్రమని కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. మరి నాగ్ అనౌన్స్ చేయబోయే సినిమా అదేనా కాదా అన్నది చూడాలి. మరోవైపు మలయాళంలో భీముడి కోణంలో సాగే మహాభారత కథలోనూ నాగ్ నటిస్తాడని ఇంతకుముందు వార్తలొచ్చాయి.

ఈ విషయమై నాగ్ సానుకూలంగా స్పందించలేదు. ఈ సినిమాలో నటించడం కష్టమే అన్నట్లు మాట్లాడాడు. ‘బ్రహ్మాస్త్ర’ నటించడం కూడా ఈ చిత్ర దర్శక నిర్మాతలు అయాన్ ముఖర్జీ.. కరణ్ జోహార్‌ల కోరిక మేరకే జరిగిందని నాగ్ చెప్పాడు. తాను బాలీవుడ్‌కు వెళ్లలేదని.. బాలీవుడే తన దగ్గరికి వచ్చిందని నాగ్ చెప్పాడు. ఈ సినిమాలో తాను 15 నిమిషాలు కనిపిస్తాడని.. ఆ 15 నిమిషాల్లోనే తన ప్రత్యేకత చాటుకుంటానని.. బల్గేరియాలో ఒక వారం షూటింగ్‌లో పాల్గొన్నానని.. తర్వాత లండన్, ముంబయిల్లోనూ షూటింగ్ చేయాల్సి ఉందని నాగ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English