ఆ నిర్మాత కష్టాలు వింటే కన్నీళ్లే..

ఆ నిర్మాత కష్టాలు వింటే కన్నీళ్లే..

భారతీయ సినిమా మూకీతో మొదలుపెట్టి ఇప్పుడు డిజిటల్ అయ్యే వరకు అన్నింట్లోనూ భాగంగా నిలిచిన దిగ్గజన నిర్మాత కె.రాఘవ 105 ఏళ్ల వయసులో నిన్ననే పరమపదించారు. కేవలం తెలుగు సినిమా వరకే కాదు.. మొత్తం బారతీయ సినీ చరిత్రలోనే ఆయనది ప్రత్యేకమైన అధ్యాయం. ఎందరో దిగ్గజ దర్శకుల్ని.. నటీనటుల్ని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనది.

అలాంటి నిర్మాత కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు రాకమానవు. ఎనిమిదేళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయిన రాఘవకు తన ఇంటి పేరు కూడా తెలియదట. తన తల్లిదండ్రులు ఎవరో ఎక్కుడున్నారో కూడా తెలియదని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. తన జీవితంలో సినిమాను మించిన మలుపులున్నాయంటూ ఆయన... మద్రాసులో తొలి నాళ్లలో తాను పడ్డ కష్టాల గురించి వివరించారు.

మద్రాసు ప్రగతి స్టూడియోలో భక్త కబీరు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే అందులో వేషం కోసం వెళ్లిన రాఘవ ఒక పాత్రకు ఎంపికయ్యారు. ఐతే ఆ సినిమాకు ఎంపిక కావడానికి ముందు వారం పాటు ఆయన సరిగా తిండే తినలేదట. దీంతో బాగా నీరసించి పోయారు. ఆ కష్టాన్ని తట్టుకుని కూడా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఐతే షూటింగ్ అయ్యాక చిత్ర బృందం అన్నం పెట్టినప్పటికీ.. కళ్లు తిరిగి పడిపోయారు. తర్వాతి రోజు ఉదయానికి కానీ ఆయనకు మెలకువ రాలేదు. లేచి నీరసంతో తూలుతూ బయటికొచ్చి చూస్తే అక్కడ చిత్ర బృందం లేదు. పైగా స్టూడియో సిబ్బంది ఇక్కడెందుకున్నావంటూ ఆయనపై దాడికి ప్రయత్నించారు.

దీంతో తనకిక చావే శరణ్యం అనుకుని స్టూడియోలోని ఒక పాడుబడ్డ బావిలో దూకేశారట రాఘవ. ఐతే ప్రాణాపాయం తప్పినా.. ఆ బావి గోడ కన్నంలో ఉన్న పాము కాటువేసిందట. దాంతో స్పృహ తప్పారట. తర్వాత పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపించారట.  జైల్లో అయినా తిండి దొరుకుతుందిలే అనుకుంటే కొన్ని రోజుల్లోనే పోలీసులు విడిచిపెట్టేశారట. ఆ తర్వాత కొన్నాళ్లకు బొంబాయి వెళ్లి అక్కడ స్టూడియోల్లో పని చేసుకుంటూ నిలదొక్కుకున్నట్లుగా రాఘవ వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు