నాగశౌర్యా.. ఈ స్పీడేంటసలు

నాగశౌర్యా.. ఈ స్పీడేంటసలు

యువ కథానాయకుడు నాగశౌర్య మామూలు స్పీడు మీద లేడిప్పుడు. ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో అతడి సినిమాలు మూడు రిలీజయ్యాయి. ఫిబ్రవరి ఆరంభంలో ‘ఛలో’ రిలీజైతే.. ఏప్రిల్ చివర్లో ‘కణం’ విడుదలైంది. మే నెలాఖర్లో ‘అమ్మమ్మగారిల్లు’ వచ్చింది. వీటిలో ‘ఛలో’ బ్లాక్ బస్టర్ అయితే.. మిగతా రెండూ ఫ్లాప్ అయ్యాయి. శౌర్య చివరి సినిమా రిలీజైన.. మూడు నెలలకే అతడి కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ‘ఛలో’ సినిమాను శౌర్య సొంత బేనర్లోనే చేసిన సంగతి తెలిసిందే. ఆ బేనర్లో రెండో సినిమా అయిన ‘నర్తనశాల’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్టు 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్.. తాజాగా దీన్నుంచి ఒక వీడియో సాంగ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

మూడు నెలల కిందటే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఇంతలోనే షూటింగ్ చివరి దశకు వచ్చేసిందట. ఇంకొన్ని రోజుల్లోనే టాకీ పార్ట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టబోతున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి నెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయబోతున్నారు. మరి ఇంత స్పీడుగా సినిమా తీశారంటే ప్లానింగ్ బాగుందని అనుకోవాలా.. లేక క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారుకోవాలా? ఆ సంగతలా వదిలేస్తే.. రెండు ఫ్లాపుల తర్వాత శౌర్య నుంచి వస్తున్న ఈ చిత్రంపై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో శౌర్య సరసన కొత్త హీరోయిన్ నటించింది. శౌర్య ఇందులో బృహన్నల తరహా పాత్ర చేస్తున్నాడని.. అందుకే ఈ చిత్రానికి ‘నర్తనశాల’ అనే పేరు పెట్టారని అంటున్నారు. ఇది కాక శౌర్య రెండు కొత్త సినిమాల్ని లైన్లో పెట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు