వర్మను కట్టేసి ఆ సినిమాలు చూపించాలి

వర్మను కట్టేసి ఆ సినిమాలు చూపించాలి

రామ్ గోపాల్ వర్మ శిష్యులు సైతం.. ఆయన లాగే చాలా విలక్షణంగా ఉంటారు. ఏమనిపిస్తే అది మాట్లాడేస్తుంటారు. బోల్డ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇటీవలే సెన్సేషనల్ హిట్టయిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సినిమా విడుదల ముంగిటే అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిలీజ్ తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తున్నాడు. అతను తన సినిమాకు సంబంధించే కాదు.. తన గురువు విషయంలోనూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒక దర్శకుడిగా వర్మ గ్రేట్ అని.. ఆయన్ని చాలా గౌరవిస్తానని.. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆయనొక నీచుడు అని అజయ్ చెప్పడం విశేషం.

వర్మ ఇతరుల్ని అదే పనిగా గిల్లుతుంటాడని.. ఏదో ఒక కామెంట్ చేస్తుంటాడని.. వివాదాలు రాజేస్తుంటాడని.. ఈ విషయంలో ఆయన తనకు నచ్చడని అజయ్ కుండబద్దలు కొట్టాడు. ఇలాంటి విషయాల్లో ఆయనొక నీచుడిలా కనిపిస్తాడని అజయ్ అన్నాడు. ఈ విషయంలో వర్మకు ఒకటే శిక్ష అని.. ఆయన్ని కిడ్నాప్ చేసి కుర్చీలో కాళ్లు చేతులు కట్టేసి కను రెప్పలు వాల్చకుండా.. కళ్లకు క్లిప్పులు తగిలించి వరుసబెట్టి ఫ్యామిలీ సినిమాలు ప్రదర్శించాలని.. అప్పుడు కానీ ఆయన తిక్క కుదరదని అన్నాడు అజయ్. ఐతే దర్శకుడిగా మాత్రం వర్మ తనకు దేవుడని.. తాను దర్శకుడిగా ఒక బయోపిక్ తీయాల్సి వస్తే అది రామ్ గోపాల్ వర్మదే అయి ఉంటుందని.. ఆయన జీవితాన్ని తెరపై చూపించాలన్నది తన కోరిక.. అందులో దర్శకుడిగా వర్మ గొప్పదనం.. వ్యక్తిగతంగా వర్మ నీచత్వం ఉంటాయని అన్నాడు అజయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు