మహేష్ కోసం ఆ డైరెక్టర్ ఎప్పుడొస్తాడంటే..

మహేష్ కోసం ఆ డైరెక్టర్ ఎప్పుడొస్తాడంటే..

ఒక కొత్త దర్శకుడు తొలి సినిమాను ఎంత పెద్ద స్టార్‌తో తీశాడు.. ఎంత బడ్జెట్లో తీశాడన్నది ముఖ్యం కాదు. అందులో కంటెంట్ ఎంత బలంగా ఉందన్నది ముఖ్యం. చిన్న సినిమాతో అయినా సరే.. తనదైన ముద్ర వేయగలిగితే.. రాత్రికి రాత్రే దశ తిరిగిపోతుంది. బడా స్టార్లు పిలిచి మరీ అవకాశం ఇస్తారు. ఇలా ఒకే సినిమాతో పెద్ద రేంజికి వెళ్లిపోయిన దర్శకులు చాలామందే ఉన్నారు. ఆ కోవలోకే సందీప్ రెడ్డి వంగా కూడా చేరిపోయాడు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అతను వేసిన ముద్ర అలాంటిలాటిది కాదు. ఈ సినిమా చూసి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా స్టన్ అయిపోయారు. సందీప్ పనితనానికి ఫిదా అయిపోయాడు. మొన్ననే అల్లు అర్జున్ సైతం తనపై ‘అర్జున్ రెడ్డి’ ఎఫెక్ట్ ఏ స్థాయిలో పడిందో చెప్పాడు. బన్నీ కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు సందీప్ టాలెంటుకి మెస్మరైజ్ అయిపోయి.. అతడితో సినిమా చేయడానికి కూడా ముందుకొచ్చాడు.

గత ఏడాదే వీళ్ల మధ్య మీటింగ్ కూడా జరిగింది. కథా చర్చలూ నడిచాయి. ఐతే సందీప్ ఆల్రెడీ హిందీ ‘అర్జున్ రెడ్డి’కి కమిట్మెంట్ ఇవ్వగా.. మహేష్ వంశీ పైడిపల్లి, సుకుమార్‌ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం దాదాపు ఖాయం. మహేష్ రెండు సినిమాలు చేసేలోపు సందీప్.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ పని పూర్తి చేయబోతున్నాడు. రీమేక్ అయినా అతను దీని కోసం చాలా సమయమే వెచ్చించనున్నాడు. ఇంకా ఈ చిత్ర షూటింగే మొదలుకాలేదు. హిందీ వెర్షన్ కోసం స్క్రిప్టు చాలా మార్చాడట సందీప్.

ఆగస్టులోనే చిత్రీకరణ మొదలవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. సినిమా మొదలు కాకముందే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. 2019 జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట. ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు. షాహిద్ కపూర్ కథానాయకుడు. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్దానికి సందీప్ మహేష్ కోసం తిరిగి టాలీవుడ్‌కు వస్తాడన్నమాట. మధ్య మధ్యలో మహేష్ సినిమా మీద పని చేస్తూ.. ప్రిన్స్ ఖాళీ అయ్యే సమయానికి అతను స్క్రిప్టుతో రెడీగా ఉంటాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు