‘ఆర్ఎక్స్ 100’లో డైరెక్టర్ కథ కూడా..

‘ఆర్ఎక్స్ 100’లో డైరెక్టర్ కథ కూడా..

వేసవి సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో మళ్లీ వేడి పుట్టించిన సినిమా ‘ఆర్ఎక్స్ 100’. కొత్త హీరో హీరోయిన్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన చిన్న సినిమా అయినప్పటికీ.. ఇది ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకుని సంచలన వసూళ్లు సాధించింది. పెట్టుబడి మీద ఐదారు రెట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది.

ఇది ఒక నిజ జీవిత గాథ స్ఫూర్తితో తీసిన సినిమా అని చివర్లో వెల్లడించాడు దర్శకుడు అజయ్ భూపతి. శివ అనే తన ఫ్రెండు జీవితాన్నే సినిమాలో చూపించాడతను. ఆ శివ ఫొటో సైతం చివర్లో చూపించాడు. ఐతే కేవలం అతనొక్కడి జీవితమే సినిమాగా మారలేదట. తన జీవితంలోని కొన్ని సంఘటనలు కూడా సినమాలో చూపించాడట అజయ్ భూపతి.

అజయ్ సైతం ప్రేమలో విఫలమయ్యాడట. మోసపోయాడట. ఒక దశలో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయాడట. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనకు కూడా వెళ్లాడట. అలాంటి స్థితిలోనే తాను రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంటుగా చేరానని.. అదే తన జీవితంలో మలుపు అని చెప్పాడు అజయ్. తన జీవితంలోని బాధనంతా క్యాష్ చేసుకోమని ఒక మహానుభావుడు సలహా ఇచ్చాడని.. దీంతో ఆ అంశాలన్నింటినీ కథ రూపంలోకి మార్చే ప్రయత్నం చేశానని.. అలాగే తన స్నేహితుడి జీవితం కూడా స్ఫూర్తిగా నిలిచి.. ‘ఆర్ఎక్స్ 100’ కథ తయారైందని అజయ్ వెల్లడించాడు.

ఒకప్పటి బాధ తనలో తర్వాత ఎంత మాత్రం లేదని.. తనను అమితంగా ప్రేమించే అమ్మాయితో జీవితం పంచుకోవాలని అనుకున్నానని.. అలాంటి అమ్మాయి తనకు దొరికిందని.. త్వరలోనే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని కూడా అజయ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు