రామోజీ.. బిగ్ బి.. ప‌వ‌న్ ల‌కు చిరు ఛాలెంజ్‌!

రామోజీ.. బిగ్ బి.. ప‌వ‌న్ ల‌కు చిరు ఛాలెంజ్‌!

చిరు ఏంది మీడియా మొఘ‌ల్ రామోజీరావుకు స‌వాల్ విస‌ర‌ట‌మా?  అది స‌రిపోన‌ట్లు బిగ్ బికి.. త‌మ్ముడు ప‌వ‌న్ ల‌కు స‌వాల్ ఛాలెంజ్ చేయ‌టం ఏమిట‌న్న సందేహం అక్క‌ర్లేదు. ఈ స‌వాల్ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసమే. గ‌డిచిన కొద్ది రోజులుగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ప్ర‌ముఖులు చెట్ల నాటాలంటూ స‌వాల్ విస‌ర‌టం తెలిసిందే.

ఒకరు మూడు మొక్క‌లు నాటి.. మ‌రో ముగ్గురికి స‌వాల్ చేయ‌టం.. వారొక్క‌క్క‌రూ మూడేసి మొక్క‌లు నాటుతూ.. మ‌రో ముగ్గురికి స‌వాల్ విసురుతున్న వైనం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు మొద‌లు సామాన్యుల వ‌ర‌కూ ఈ గ్రీన్ ఛాలెంజ్ ను విసురుతూ అంత‌కంత‌కూ ఈ కాన్సెప్ట్ ను స్ప్రెడ్ చేయ‌టం తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాను మూడు మొక్క‌లు నాటారు. ఆ సంద‌ర్భంగా తాను కూడా ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. అందులో ఒక‌రు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే.. మ‌రొక‌రు బిగ్ బీ అమితాబ్ కాగా.. మూడో వ్య‌క్తి మాత్రం మీడియా మొఘ‌ల్‌.. ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు కావ‌టం విశేషం.

మూడు మొక్క‌లు నాటిన సంద‌ర్భంగా చిరు మాట్లాడుతూ.. త‌న‌కు వ‌చ్చిన ఛాలెంజ్ ను అంగీక‌రిస్తూ.. త‌న ఇంటి పెర‌ట్లో మూడు మొక్క‌లు నాటాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మ‌రో ముగ్గురు ప్ర‌ముఖుల్ని ఎంచుకొని వారిని నామినేట్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. తాను ఛాలెంజ్ విసిరిన ముగ్గురు త‌న స‌వాల్ ను స్వీక‌రించి.. మొక్క‌లు నాటుతార‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. అమితాబ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సార్ ప్లీజ్ గ్రీన్ ఛాలెంజ్ ను అంగీక‌రించండి.. ఇండియా మిమ్మ‌ల్ని ఫాలో అవుతుంద‌ని పేర్కొన్నారు. మొత్తానికి హ‌రిత‌హారం పేరుతో కేసీఆర్ చేప‌ట్టిన మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని.. ఒక ఎన్జీవో సంస్థ గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొదలెట్టిన కాన్సెప్ట్ అంత‌కంత‌కూ విస్త‌రిస్తూ ప‌లువురిలో మొక్క‌లు నాటే స్ఫూర్తిని నింప‌టం సంతోషించ‌ద‌గ్గ అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు