పైరసీ సీడీలపై సినిమా వస్తోంది

పైరసీ సీడీలపై సినిమా వస్తోంది

పైరసీ.. దశాబ్దాలుగా ఇండస్ట్రీని వేధిస్తున్న సమస్య. ఒకప్పుడు సినిమాల్ని పైరసీ చేసి సీడీలు వేసి అమ్మేవాళ్లు. ఆ తర్వాతి కాలంలో పైరసీ వెబ్ సైట్లు వచ్చాయి. ఈ జాఢ్యాన్ని నివారించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకపోతోంది. కొత్త సినిమా రిలీజైన రోజు రాత్రికే పైరసీ వెర్షన్ ఇంటర్నెట్లో మొబైళ్లలో ప్రత్యక్షం అవుతోంది. ఇండస్ట్రీని అల్లాడిస్తున్న ఈ సమస్య మీద ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే సాయి కార్తీక్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అందులో టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర కథానాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇందులో నవీన్ చంద్ర పైరసీ సీడీలు తయారు చేసే కుర్రాడిగా కనిపించనున్నాడట. మరి హీరోనే ఈ నేరం చేసేవాడిగా ఉంటే సినిమా ఎలా నడుస్తుందన్నది ఆసక్తికరం.

సాధారణంగా ఇలాంటి కథలతో తమిళ డైరెక్టర్లు రియలిస్టిక్ మూవీస్ తీస్తుంటారు. తమిళంలో పైరసీ సీడీలకు సంబంధించి ఎపిసోడ్లున్న సినిమాలు ఆల్రెడీ వచ్చాయి కూడా. తెలుగులో మాత్రం ఇలాంటి ప్రయత్నం ఇదే తొలిసారి కావచ్చు. తన తొలి సినిమా ‘అందాల రాక్షసి’ విడుదల తర్వాత ఆ చిత్రాన్ని తన సొంత ఊరు బళ్లారిలో స్నేహితులతో కలిసి చూద్దామని ఎంతో ఆసక్తిగా వెళ్లానని.. ఐతే ఆ ఊర్లో జనాలు తన సినిమా పైరసీ వెర్షన్ చూస్తుండటం చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని.. తాము అంత కష్టపడి సినిమా తీస్తే ఇలా చేస్తున్నారేంటని అనిపించిందని.. ఇప్పుడు పైరసీ బెడద మరింత పెరిగిందని.. దీని నేపథ్యంలో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉందని.. ఇది తెలుగులో ఒక వెరైటీ సినిమా అవుతుందని నవీన్ చంద్ర చెప్పాడు. ఈ చిత్రంలో గాయత్రి సురేష్ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్నందిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు