ఓపెనింగ్స్ ఓకే.. సినిమా గట్టెక్కుతుందా?

ఓపెనింగ్స్ ఓకే.. సినిమా గట్టెక్కుతుందా?

బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ కంటే ముందు మూడు సినిమాల్లో నటిస్తే.. రెంటికి మంచి టాకే వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అంచనాల్ని మించి వచ్చాయి. అయినప్పటికీ ‘అల్లుడు శీను’.. ‘జయ జానకి నాయక’ చిత్రాలు హిట్లుగా నిలవలేకపోయాయి. అందుక్కారణం వాటికి మితిమీరి ఖర్చుపెట్టడమే. బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ చూసుకోకుండా ఆ రెండు సినిమాలపై అపరిమితంగా ఖర్చు చేశారు.

శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ ‘సాక్ష్యం’ కూడా ఇదే కోవలోనిదే. ఈ చిత్రానికీ బడ్జెట్ మరీ ఎక్కువైపోయింది. దీనికి టాక్ అటు ఇటుగా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. తొలి రోజు రూ.3.2 కోట్ల షేర్ అంటే చిన్న విషయమేమీ కాదు. శని ఆదివారాల్లో ఆ స్థాయిలో కాకపోయినా మంచి షేరే వచ్చింది. వరల్డ్ వైడ్ షేర్ ఏడు కోట్లు దాటినట్లు తెలుస్తోంది.

స్టార్ ఇమేజ్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు ఈ వసూళ్లు రావడం గొప్ప విషయమే. కానీ అంతమాత్రాన బయ్యర్లు.. నిర్మాత సంతోషించడానికేమీ లేదు. ఈ చిత్రానికి రూ.30 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారు. అమ్మకాలు రూ.40 కోట్ల దాకా జరిగినట్లు వార్తలొచ్చాయి. ఆ రేంజ్ సినిమాకు రూ.7 కోట్ల షేర్ ఎంతమాత్రం సరిపోదు. దీనికి రెట్టింపు షేర్ వచ్చి ఉంటే సినిమా బయటపడుతుందన్న ఆశలుండేవి.

వీకెండ్ తర్వాత ‘సాక్ష్యం’ నిలబడటం కష్టంగానే కనిపిస్తోంది. దీనికి డివైడ్ టాక్ వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకే సోమవారం నుంచి వసూళ్లు పడిపోతుంటాయి. మరి ‘సాక్ష్యం’ సంగతి చెప్పేదేముంది? కచ్చితంగా పెద్ద డ్రాప్ తప్పకపోవచ్చు. వచ్చే శుక్రవారం ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్నాయి. ఆలోపు ‘సాక్ష్యం’ ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి. ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఇది భారీ నష్టాలే మిగిల్చేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు