కెరీర్ స్ట్రగుల్.. తండ్రి మరణం.. సుశాంత్ ఆవేదన

కెరీర్ స్ట్రగుల్.. తండ్రి మరణం.. సుశాంత్ ఆవేదన

టాలీవుడ్ బడా ఫ్యామిలీస్‌లో అక్కినేని వాళ్లది ఒకటి. అలాంటి కుటుంబంలో పుట్టి హీరో అయిన కుర్రాడికి ఏం కష్టాలు ఉంటాయి అనుకుంటాం. కానీ తాను ఎంతో వేదన అనుభవించానని అంటున్నాడు నాగార్జున మేనల్లుడు సుశాంత్. ‘కాళిదాసు’తో మొదలుపెట్టి... ‘ఆటాడుకుందాం రా’ వరకు సుశాంత్ నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే. హీరోగా పరిచయం అయి పుష్కరం కావస్తున్నా ఇప్పటిదాకా అతను సక్సెస్ చూడలేదు. ఈ ఫ్లాపులకు తోడు.. తన తండ్రి మరణం ఒక దశలో తనను కుంగదీసిందని సుశాంత్ చెప్పాడు. చివరగా చేసిన ‘ఆటాడుకుందాం రా’ కూడా ఫ్లాప్ అవడంతో తాను అయోమయంలో పడిపోయానని.. కెరీర్ చాలా స్ట్రగుల్లో ఉన్న సమయంలోనే తన తండ్రి కూడా చనిపోవడం వేదన మిగిల్చిందని సుశాంత్ చెప్పాడు.

తన కెరీర్ గురించి తన తండ్రి కంగారు పడేవాడని.. ఐతే అప్పటికే ‘చి ల సౌ’ కథ వినడంతో చనిపోవడానికి ముందు రోజు ఆయనకు ఈ సినిమా గురించి చెప్పి.. తన కెరీర్ గురించి ఏం బాధ లేదని.. మళ్లీ నిలదొక్కుకుంటానని చెప్పి వచ్చానని సుశాంత్ తెలిపాడు. ‘చి ల సౌ’ సినిమాతో ఆయనకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని అనిపిస్తోందని అతనన్నాడు. సినిమా ఫ్లాప్ అయినపుడు అందరి లాగే తానూ బాధ పడతానని.. ఆ సమయంలో చాలామంది అనేక రకాలుగా విమర్శిస్తారని.. ఆ విమర్శల్ని బట్టి తాను లోపాలు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తానని సుశాంత్ చెప్పాడు. ఫ్లాపుల తాలూకు బాధను మరిచిపోవడానికి స్నేహితుల్ని కలుస్తానని.. కుటుంబంతో సరదాగా గడుపుతానని.. అఖిల్, చైతూలను కూడా కలుస్తుంటానని.. ఇలా ఏదో ఒకటి చేసి బాధ నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటాని అన్నాడు. ‘చి ల సౌ’ మాత్రం తనను ఎలాంటి బాధ పెట్టదని.. మంచి విజయాన్నందిస్తుందని ఆశిస్తున్నట్లు అతను చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు