నేను లావవ్వడానికి వాళ్లే కారణం-ఎన్టీఆర్

నేను లావవ్వడానికి వాళ్లే కారణం-ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఆరంభం నుంచి దాదాపు దశాబ్దం పాటు ఎంత లావుగా కనిపించేవాడో తెలిసిందే. ‘రాఖీ’ టైంకి అయితే అతను పూర్తిగా అదుపు తప్పిపోయాడు. చూడటానికి చాలా ఇబ్బందికరంగా తయారయ్యాడు. కానీ ‘యమదొంగ’ సినిమా ముంగిట మొత్తం ఒంట్లోని అదనపు కేలరీలన్నీ తగ్గించేసి సన్నగా.. రివటలా తయారయ్యాడు. ఇప్పుడు మిగతా హీరోల్లాగే ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఐతే తాను ఒకప్పుడు అంతలా లావైపోవడానికి తిండి పుష్టే కారణమని అతనంటున్నాడు. తాను ఒకప్పుడు విపరీతంగా తినేవాడినని.. తనకు అతిగా తినిపించి లావు చేసిన వాళ్లలో ఫైట్ మాస్టర్ విజయ్.. అతడి భార్య కూడా ఉన్నారని తారక్ చెప్పాడు. విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా పరిచయం కానున్న ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా ఆడియో వేడుకలో ఈ విషయం చెప్పాడు తారక్.

తాను విజయ్ మాస్టర్‌తో కలిసి పని చేసినపుడల్లా వాళ్ల ఇంటి నుంచే తనకు క్యారేజీ వచ్చేదని.. వాళ్లు బాగా రుచిగా వండి తనకు అపరిమితంగా వడ్డించడం వల్ల తాను మరింత లావైపోయానని ఎన్టీఆర్ అన్నాడు. తనకు మూలిగలు (నల్లిలు) అంటే చాలా ఇష్టమని.. ఇష్టం కదా అని వాళ్లు మరీ 200 నల్లిలేసి వండించేవాళ్లని.. ఇదేంటో అర్థం అయ్యేది కాదని ఎన్టీఆర్ అన్నాడు. విజయ్ మాస్టర్ తనయుడంటే తనకు కుటుంబ సభ్యుడి లాంటి వాడని.. అతడి సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎన్టీఆర్ అన్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో విజయ్ పాత్ర కీలకమని.. తనకు ఫైట్లు ఎలా చేయాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ నేర్పించింది విజయే అని.. ఫైట్ మాస్టర్ల కష్టం అలాంటిలాంటిది కాదని.. వాళ్లు ప్రాణాలకు తెగించి కష్టపడతారని ఎన్టీఆర్ అన్నాడు. తామందరం తెరముందే హీరోలని.. కానీ తెరవెనుక హీరోలు వీళ్లే అని ఎన్టీఆర్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు