ధనుష్.. మళ్లీ సెన్సేషనే

ధనుష్.. మళ్లీ సెన్సేషనే

బ్యాగ్రౌండ్ లేదు.. ఫిజిక్ లేదు.. హీరో లుక్స్ లేవు.. ఐతేనేం.. తన అద్భుతమైన నటనతో తిరుగులేని పేరు సంపాదించి.. పెద్ద స్టార్‌గా ఎదిగాడు ధనుష్. తమిళనాట మాత్రమే కాక.. దేశవ్యాప్తంగా అతడికి నటుడిగా గొప్ప పేరే ఉంది. ధనుష్ ఏంటో దేశం మొత్తానికి తెలిసేలా చేసిన సినిమా ‘ఆడుగళం’. ఆ చిత్రానికి అతను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.

ఆ సినిమా దర్శకుడు వెట్రిమారన్‌తో అంతకుముందు ధనుష్ చేసిన ‘పొల్లాదవన్’ కూడా సూపర్ హిట్టే. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ‘వడ చెన్నై’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో తీర్చిదిద్దారు దీని టీజర్ని.

శనివారం ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ‘వడ చెన్నై’ టీజర్ లాంచ్ చేశారు. ధనుష్-వెట్రిమారన్ కలయికలో మరో సెన్సేషనల్ మూవీ అయ్యేలా ఉంది ఈ టీజర్ చూస్తుంటే. చెన్నైలో రౌడీయిజానికి.. నేరాలకు పెట్టింది పేరైన ఓ ప్రాంతం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. క్యారమ్ ప్లేయర్ అయిన ఓ కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో రౌడీగా మారి.. ఆ పద్మవ్యూహంలో ఎలా చిక్కుకుపోయాడో ఇందులో చూపిస్తున్నాడు వెట్రిమారన్. టీజర్ అంతటా ఒక ఇంటెన్సిటీ కనిపించింది. ఒక గొప్ప సినిమా చూడబోతున్న భావన కలిగించింది.

ధనుష్ లుక్.. అతడి పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదరగొట్టేశాడంతే. విజువల్స్.. మ్యూజిక్ అన్నీ కూడా టాప్ క్లాస్ అనిపిస్తున్నాయి. ఐతే అన్నీ కూడా రియలిస్టిగ్గా అనిపిస్తున్నాయి. ధనుష్‌తో పాటు చాలా పాత్రలకు సినిమాలో ప్రాధాన్యం ఉన్నట్లుంది. యాక్షన్, వయొలెన్స్ బాగా దట్టించినట్లున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు