అల్లు వారి ఇమేజ్‌కి డ్యామేజ్

అల్లు వారి ఇమేజ్‌కి డ్యామేజ్

టాలీవుడ్ నిర్మాతల్లో అల్లు అరవింద్‌కు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గొప్ప అభిరుచి ఉన్న నిర్మాతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అరవింద్ సినిమాలంటే చాలా క్లీన్ అని.. ఎలాంటి వల్గారిటీకి తావుండదని ప్రేక్షకుల్లో బలమైన నమ్మకముంది. ఆయన వివాదాలకు కూడా చాలా దూరంగా ఉంటారు. అలాంటి నిర్మాత బేనర్ నుంచి వస్తున్న సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఆ చిత్రమే.. ‘గీత గోవిందం’.

నిజానికి ముందు ఈ సినిమాపై చాలా మంచి అభిప్రాయం కలిగింది జనాలకు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ విజయ్ దేవరకొండ.. ఆ సినిమాకు పూర్తి భిన్నంగా.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసినట్లుగా కనిపించాడు. ఈ చిత్ర టీజర్.. యూత్ ను మాత్రమే  కాక ఫ్యామిలీస్‌ను కూడా ఆకట్టుకుంది. ‘ఇంకేం ఇంకేం..’ అంటూ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాట కూడా అందరినీ ఆకట్టుకుంది.

పబ్లిసిటీ కోసం ఏ జిమ్మిక్కులు.. అడ్డ దారులూ తొక్కాల్సిన అవసరం లేకుండానే ‘గీత గోవిందం’కు బంపర్ క్రేజ్ వచ్చింది. ఇలాంటి టైంలో చిత్ర బృందం చేసిన పని తీవ్ర విమర్శల పాలైంది. ‘వాట్ ద ఎఫ్’ అంటూ రిలీజ్ చేసిన పాట తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇలాంటి మాటనే పల్లవిగా పెట్టి పాట తీర్చిదిద్దడమేంటో జనాలకు అర్థం కావడం లేదు. ఇంకా చరణాల్లో రాముడు-సీతల గురించి వివాదాస్పద లైన్లు ఉండటం వివాదానికి దారి తీసింది. విమర్శలు తీవ్రంగానే ఉండటంతో పాటను యూట్యూబ్ నుంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది.

విజయ్ దేవరకొండ నుంచి ఇలాంటి పాట రావడంలో ఎవరికీ ఆశ్చర్యం లేదు. కానీ అతను నటిస్తున్నది ‘గీతా ఆర్ట్స్’ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న బేనర్లో అన్న సంగతి చిత్ర బృందం మరిచిపోయింది. దర్శకుడు పరశురామ్ సైతం ఇలాంటి ఇమేజ్ ఉన్న దర్శకుడే. మరి అతనెందుకిలా ఆలోచించాడో? ఈ పాటతో అల్లు అరవింద్ ఇమేజ్‌కు బాగా డ్యామేజ్ జరిగింది. ఆయన ఈ పాటకు ఎలా అనుమతి ఇచ్చారన్నదే చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. వివాదం పెద్దది కాకుండా ఆయనే రంగంలోకి దిగి.. పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఈమాత్రం జాగ్రత్త ముందే ఉండి ఉంటే ఆయన పేరు దెబ్బ తినేది కాదు కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు