తెలుగులో మరో లెజెండ్ బయోపిక్

తెలుగులో మరో లెజెండ్ బయోపిక్

‘మహానటి’ సినిమా తర్వాత బయోపిక్ అనేది సూపర్ సక్సెస్ ఫుల్ ఫార్ములా అయిపోయింది. తెలుగులో వరుసగా బయోపిక్స్ తెరమీదికి వస్తున్నాయి. ఆల్రెడీ నందమూరి తారకరామారావు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిల జీవిత కథల్ని సినిమాలుగా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజం జీవితాన్ని వెండితెరకు ఎక్కించే ప్రయత్నం మొదలైంది.

అద్భుతమైన చిత్రాలకు రూపమిచ్చిన లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ మీద సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు రచయిత.. దర్శకుడు జనార్దన మహర్షి. ‘విశ్వ దర్శనం’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది.

ఇప్పటికే ‘విశ్వదర్శనం’ పేరుతో ఒక పుస్తకాన్ని రూపొందించాడు జనార్దన మహర్షి. దాని ఆధారంగానే ఈ సినిమా తీయనున్నాడు. విశ్వనాథ్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని సినిమాకు శ్రీకారం చుట్టాడు మహర్షి. ఈ చిత్రానికి సీనియర్ నటుడు.. రచయిత తనికెళ్ల భరణి రచనా సహకారం అందించబోతున్నారు. మరి ఇందులో విశ్వనాథ్ పాత్ర ఎవరు చేస్తారో చూడాలి. రచయితగా 90ల్లో మంచి పేరు సంపాదించిన జనార్దన మహర్షి.. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘గోపి’.. ‘పవిత్ర’ సినిమాలు రూపొందించాడు. అవి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మరి విశ్వనాథ్ సినిమాను అతను ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి. ఈ వార్త విశ్వనాథ్ అభిమానులకు సంతోషాన్నిచ్చేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు