ఆ దర్శకుడు తెలుగులో ఔట్.. మలయాళంలో ఇన్

ఆ దర్శకుడు తెలుగులో ఔట్.. మలయాళంలో ఇన్

హిందీలో కొన్నేళ్ల కిందట సూపర్ హిట్టయిన ‘క్వీన్’ సినిమాను దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో తమన్నా కథానాయికగా విలక్షణ దర్శకుడు నీలకంఠ తీయాల్సింది. కానీ ఆయనకు.. తమన్నాకు అభిప్రాయ భేదాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి వైదలొగినట్లు వార్తలొచ్చాయి. కారణం ఏదేతేనేం.. నీలకంఠ మాత్రం తెలుగు వెర్షన్ రీమేక్ నుంచి తప్పుకున్నారు.

ఆయన స్థానంలో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ వచ్చాడు. ఐతే నీలకంఠ పూర్తిగా ‘క్వీన్’ రీమేక్ నుంచి తప్పుకోలేదు. ఆయన ఈ చిత్ర మలయాళ వెర్షన్ డైరెక్ట్ చేయడం విశేషం. నిజానికి మలయాళ వెర్షన్‌కు రేవతిని దర్శకురాలిగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆలోచన మారిపోయింది. నీలకంఠ మలయాళ వెర్షన్ టేకప్ చేశారు. రేవతి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తోంది.

మలయాళంలో మాంజిమా మోహన్ కథానాయికగా నటిస్తోంది. నాలుగు వెర్షన్లనూ వేర్వేరు హీరోయిన్లు.. దర్శకులతో ఒకే లొకేషన్లలో చిత్రీకరించడం విశేషం. కన్నడలో పారుల్ యాదవ్.. తమిళంలో కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించారు. ఇటీవలే అన్ని వెర్షన్ల చితీ్రకరణా పూర్తయింది. అక్టోబర్లో ఒకేసారి ఈ నాలుగు చిత్రాల్నీ రిలీజ్ చేయబోతున్నారు. మను కుమార్ ఈ చిత్రాల్ని నిర్మిస్తున్నాడు. కన్నడలో రమేష్ అరవింద్ దర్శకుడు.

కంగనా రనౌత్ కథానాయికగా వికాస్ బాల్ రూపొందించిన ‘క్వీన్’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త చరిత్రకు తెర తీసింది. ఈ చిత్రానికి కంగనా జాతీయ అవార్డు కూడా అందుకోవడం విశేషం. మరి దక్షిణాదిన ఈ చిత్ర రీమేక్‌లు ఎలా ఆడతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు