విజయేంద్ర ప్రసాద్.. ఆ క్రేజే వేరు

విజయేంద్ర ప్రసాద్.. ఆ క్రేజే వేరు

ఏ ముహూర్తాన రాజమౌళి ‘బాహుబలి’ సినిమా చేయాలని ఫిక్సయ్యాడో కానీ.. ఆ సినిమాతో చాలామంది జాతకాలు మారిపోయాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించారు. ‘బాహుబలి’ కథకుడు.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. దీని తర్వాత ఆయన కథ అందించిన బాలీవుడ్ మూవీ ‘భజరంగి భాయిజాన్’ సైతం ఆయనకు ఎనలేని పేరు తెచ్చింది.

బాలీవుడ్లోని భారీ ప్రొడక్షన్ హౌజ్‌లు ఆయన కోసం క్యూ కట్టే పరిస్థితి వచ్చింది. ఆయన ఆల్రెడీ మూణ్నాలుగు భారీ హిందీ చిత్రాలకు రచన చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్‌తో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థతో కలిసి ఆయన కొన్నేళ్ల పాటు పని చేయబోతున్నారు.

ఈరోస్ టీంతో కలిసి స్క్రిప్టులు తయారు చేయడం.. సినిమాల నిర్మాణంలో సహకారం అందించడం.. డిస్ట్రిబ్యూషన్.. రిలీజ్ పనుల్లోనూ భాగస్వామి కావడం కోసం విజయేంద్ర ప్రసాద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇన్ని సినిమాలు.. ఇంత టైం లిమిట్ అని ఏమీ లేకుండా సుదీర్ఘ కాలం ఈ బంధం కొనసాగనుంది. 75 ఏళ్ల విజయేంద్ర ప్రసాద్.. ఇక సినిమాలకు సంబంధించి యాక్టివ్‌గా ఉన్నంత కాలం ఈరోస్‌తో బంధం కొనసాగించనున్నారు. ఇందుకోసం ఆయనకు భారీగానే పారితోషకం అందననున్నట్లు సమాచారం.

ఈ వయసులోనూ ఆయన ఇంత యాక్టివ్‌గా ఉంటూ.. ఇలాంటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఆశ్చర్యమే. దీన్ని బట్టే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్.. రాజమౌళి తర్వాతి సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English