దావూద్‌ను వదలని వర్మ

దావూద్‌ను వదలని వర్మ

రామ్ గోపాల్ వర్మకు మాఫియా కథలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలిసిందే. ‘సత్య’తో మొదలుపెట్టి ఎన్నో మాఫియా కథల్ని తెరకెక్కించాడు వర్మ. ముంబయి మాఫియా విషయంలో వర్మ తీసిన సినిమాల్నే ఒక జానర్‌గా పరిగణిస్తారు విశ్లేషకులు. వర్మ అసలైన టాలెంట్ కనిపించేది ఈ సినిమాల్లోనే. ఐతే గత కొన్నేళ్లలో వర్మ తన టచ్ కోల్పోయాడు. పనికి రాని సినిమాలన్నీ తీసి పేరు పోగొట్టుకున్నాడు.

ఇటీవలే వచ్చిన ‘ఆఫీసర్’ కూడా మాఫియా నేపథ్యంలో సాగే సినిమానే. కానీ అందులో వర్మ ఒకప్పటి మెరుపులేమీ కనిపించవు. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అయినప్పటికీ వర్మలో మాఫియా మోజేమీ తగ్గలేదు. సంజయ్ దత్ కథను మాఫియా కోణంలో చూపిస్తూ సినిమా తీస్తానంటూ ఇటీవలే వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దాని సంగతేమో కానీ.. మాఫియా నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ తీయడానికి మాత్రం వర్మ రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత మధు మంతెనతో కలిసి వర్మ ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నాడు. దావూద్ ఇబ్రహీం ‘డి’ కంపెనీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ‘డి కంపెనీ’ పేరుతోనే ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. 80ల్లో మాఫియా డాన్ గా దావూద్ ఇబ్రహీం ఎదుగుదల మొదలుకుని.. గ్యాంగ్ వార్స్.. 93 ముంబయి దాడుల వరకు ఈ వెబ్ సిరీస్‌లో అన్నీ చూపిస్తానని వర్మ అంటున్నాడు.

తాను 20 ఏళ్లుగా ముంబయి మాఫియా గురించి సేకరిస్తున్న సమాచారమంతా ఇందులో చూపిస్తానని.. గతంలో ముంబయి మాఫియా నేపథ్యంలో ‘సత్య’, ‘కంపెనీ’ లాంటి సినిమాలు తీసినప్పటికీ ఈ వెబ్ సిరీసే తన దగ్గరున్న సమాచారానికి పూర్తి న్యాయం చేయగలదని వర్మ అంటున్నాడు. ఐతే ఇంతకుముందు ‘కడప’.. ‘గన్స్ అండ్ థైస్’ పేర్లతో రెండు వెబ్ సిరీస్ ప్రకటించి.. ట్రైలర్లు కూడా వదిలి.. ఆ తర్వాత వాటి సంగతి పట్టించుకోని వర్మ.. ‘డి కంపెనీ’ సంగతి ఏం చేస్తాడో చూడాలి.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు