భారతీయుడు-2కి లైన్ క్లియర్

భారతీయుడు-2కి లైన్ క్లియర్

లోక నాయకుడు కమల్ హాసన్.. ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. బాలీవుడ్ వాళ్లు కూడా సౌత్ సినిమా వైపు చూసేలా చేసింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కానీ రెండు దశాబ్దాల తర్వాత కానీ ఆ కోరిక నెరవేరట్లేదు. కమల్-శంకర్ కలిసి ‘భారతీయుడు’ సీక్వెల్ చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐతే ప్రకటన వచ్చి చాలా కాలం అయింది కానీ.. సినిమా మాత్రం సెట్స్ మీదికి వెళ్లలేదు. ఒక సినిమా పని పూర్తి చేశాక కానీ.. ఇంకో సినిమా మీదికి వెళ్లని శంకర్.. ‘2.0’లో లాక్ అయిపోవడంతో ‘భారతీయుడు-2’ సంగతి ఎటూ తేలకుండా పోయింది.

ఐతే ఇటీవలే ‘2.0’కు అన్ని సమస్యలూ తొలగిపోయి నవంబరు 29న విడుదలవుతుందని ప్రకటించిన శంకర్.. భారతీయుడు-2కి లైన్ క్లియర్ చేశాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్లోనే మొదలుపెట్టడానికి శంకర్ ప్లాన్ రెడీ చేశాడట. ‘భారతీయుడు-2’కు ముందు దిల్ రాజును నిర్మాతగా అనుకున్నారు. కానీ ఆయన అనివార్య కారణాలతో వెనక్కి తగ్గాడు. కమల్-శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతను సెట్ చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కానీ ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉండటంతో పెద్ద నిర్మాతే కావాలనుకున్నాడు శంకర్.

అన్ని విషయాలూ చూసుకుని చివరికి ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లోనే ఈ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. శంకర్ కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న కమల్.. అక్టోబరు నుంచి నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా అయ్యాక ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడతాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు