విశ్వరూపం-2.. సీక్వెల్ మాత్రమే కాదు

విశ్వరూపం-2.. సీక్వెల్ మాత్రమే కాదు

ఐదేళ్ల నిరీక్షణకు తెరపడబోతోంది. కమల్ హాసన్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘విశ్వరూపం-2’ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో మరుగున పడిపోయిన ఈ చిత్రాన్ని గత ఏడాది కమల్ హాసన్ తన చేతుల్లోకి తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

మొత్తానికి సినిమా రెడీ అయింది. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే తొలి భాగానికి.. రెండో భాగానికి మధ్య ఐదేళ్లకు పైగా విరామం వచ్చేసిన నేపథ్యంలో ఈ చిత్రంపై జనాల్లో ఆసక్తి ఉంటుందా అన్న సందేహాలు లేకపోలేదు. ఐతే కమల్ ఇది పట్టించుకోవాల్సిన విషయమే కాదంటున్నాడు. ఎంత గ్యాప్ వచ్చినప్పటికీ ‘విశ్వరూపం’ చూసిన వాళ్లందరూ ‘విశ్వరూపం-2’ చూస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

‘విశ్వరూపం’ చూడని వాళ్లకు కూడా ‘విశ్వరూపం-2’ చూశాక తొలి భాగం మీద ఆసక్తి కలుగుతుందని కమల్ చెప్పాడు. ‘విశ్వరూపం’కు ఇది కేవలం కొనసాగింపు చిత్రం కాదని.. అంతకుమించిన విషయాలు ఇందులో ఉంటాయని కమల్ తెలిపాడు. ఇది సీక్వెల్ మాత్రమే కాక.. ప్రీక్వెల్ కూడా అని కమల్ అన్నాడు. ‘విశ్వరూపం’తో సంబంధం లేకుండా ‘విశ్వరూపం-2’ను ఒక వేరే సినిమాలాగా కూడా చూడొచ్చని చెప్పాడు.

తన పాత్రలో అసలైన దేశభక్తి అంతా ఈ చిత్రంలో కనిపిస్తుందని.. అలాగే మిగతా పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయని కమల్ తెలిపాడు. కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా కుమార్.. ఆండ్రియా జెరెమీ.. శేఖర్ కపూర్.. రాహుల్ బోస్ కీలక పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. ఆగస్టు 9న యుఎస్‌లో ఈ చిత్రానికి భారీగా ప్రిమియర్లు ప్లాన్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు